నెళ్లాళ్ల విరామానికి ఎండ్ కార్డ్.. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు.!
Published on: Mon Aug 31, 2026 3:08PM

పశ్చిమాసియా ప్రాంతంలో గత నెల రోజులుగా కనిపించిన తాత్కాలిక ప్రశాంతత ఆవిరైపోయింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు జరిగిన దౌత్యపరమైన చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో.. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సైనిక ఘర్షణలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆదివారం (ఆగస్టు 30) నుంచి మళ్లీ అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
హోర్ముజ్ జలసంధిలోని లారక్ ఐలాండ్ సమీపంలో ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా దాడికి పాల్పడ్డాయి. అలాగే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో సీమైన్స్ అమర్చేందుకు సిద్ధమవుతున్నాయన్న ఆరోపణలతో, వారి రాకెట్ లాంచర్లను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జరిగిన ఈ సైనిక చర్య ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది.
అదే విధంగా అమెరికా దాడులకు ఇరాన్ దీటుగా స్పందించింది. మిలిల్ ఈస్ట్ లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. జోర్డాన్ సరిహద్దుల వైపు దూసుకొచ్చిన ఎనిమిది ఇరాన్ క్షిపణులను అక్కడి వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అదలా ఉంటే.. ఖతార్‌లోనిఅమెరికా సైనిక స్థావరాల సమీపంలో కూడా భారీ పేలుళ్లు సంభవించాయి.
ఈ సైనిక దాడుల ప్రభావం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు రెండు శాతం మేర పెరిగాయి. రాబోయే రోజుల్లో రవాణా ఆటంకాలు పెరిగితే చమురు లభ్యత తగ్గి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
[US Iran War, Strait of Hormuz conflict, America Iran Missile attack, Middle East tension, Global crude oil prices rise, Telugu One]


