TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియన్స్ అమెరికా కల కల్లేనా: అమెరికా గ్రీన్‌కార్డు అందని ద్రాక్షేనా?

Published on: Fri Sep 25, 2026 10:32AM

అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డు కోసం  నిరీక్షిస్తున్న వేలాది మంది భారతీయులకు నిరాశే ఎదురుకానుంది. అమెరికా వలస విధానంలో  మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో అమెరికన్ చట్టసభలో కొత్త బిల్లు ప్రతిపాదన వచ్చింది.  ఈ బిల్లు అక్కడి హెచ్-1బీ హోల్డర్లు,  ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు కోరుకునే ప్రొఫెషనల్స్‌లో ఆందోళన రేకెత్తిస్తోంది. 

రిపబ్లికన్ పార్టీ సీనియర్ సెనేటర్ టామీ ట్యూబర్‌విల్లే ఈ వివాదాస్పద బిల్లును ప్రతిపాదించారు.  అమెరికన్స్ ఫస్ట్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్' పేరిట ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రస్తుతం అమల్లో ఉన్న వలస పద్ధతులను పూర్తిగా రద్దు చేసి.. కొత్తగా  పాయింట్ల ఆధారిత కేటాయింపుల విధానాన్ని తెరపైకి తేవడమే. ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. గతంలో దాఖలు చేసి పెండింగ్‌లో ఉన్న అనేక ఉద్యోగ ఆధారిత దరఖాస్తులు  రద్దయ్యే అవకాశం ఉంది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం..  ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కేవలం లక్షా,92 వేల గ్రీన్‌కార్డులను మాత్రమే కేటాయించాలి.  దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి అమెరికాలో ఉపాధి  ఉండటంతో పాటు, నిర్ధారిత పాయింట్లు కూడా ఉండాలి.  గ్రీన్ కార్డుకు కనీస అర్హతగా 16 పాయింట్లు ఉండటం అనివార్యం.  అలాగే దరఖాస్తుదారుల వయస్సు 18 నుండి 51 సంవత్సరాల మధ్య ఉండాలి.  ఇంగ్లీష్ భాషపై పట్టు కలిగి ఉండాలి.  

ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం అభ్యర్థుల విద్యార్హతలు, వేతన స్థాయి, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, సైనిక రంగంలో సేవలు,  విశిష్ట ప్రతిభ ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. ఎవరికైతే అత్యధిక పాయింట్లు లభిస్తాయో వారికే తొలి ప్రాధాన్యం దక్కుతుంది. ఒకవేళ స్థానిక అమెరికన్ డిగ్రీ లేని అభ్యర్థులైతే..  అక్కడి రాష్ట్ర సగటు వేతనంతో పోలిస్తే కనీసం రెండింతల జీతం ఉన్న ఉద్యోగ ఆఫర్‌ను కలిగి ఉండాలి. అదే అమెరికన్ డిగ్రీ ఉన్నవారికైతే ఈ నిబంధన 1.5 రెట్లుగా వర్తిస్తుందని బిల్లులో ప్రతిపాదించారు.  

ఇందులో కేవలం ఉద్యోగ వీసాలు మాత్రమే కాకుండా ఇతర వలస మార్గాలపై కూడా కోత విధించారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న డైవర్సిటీ వీసా లాటరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని  సూచించారు. అలాగే.. కుటుంబ ఆధారిత వలసల హద్దులను కేవలం జీవిత భాగస్వాములు,  మైనర్ పిల్లల వరకు మాత్రమే పరిమితం చేయాలని పేర్కొన్నారు. దీనివల్ల వయోజన పిల్లలు, తోబుట్టువులు,  వృద్ధులైన తల్లిదండ్రుల కోసం గ్రీన్‌కార్డు దరఖాస్తు చేసుకునే వీలు ఉండదు. 

[US Green Card, new Green Card bill, pointsbased visa, Americans First Immigration Act, Green Card challenges,  Indians, Telugu One]