US DHS Controversy: సిక్కులపై అనుచిత ప్రకటన.. చివరకు వెనక్కి తగ్గిన అమెరికా!
Published on: Fri Sep 11, 2026 10:58AM
.webp)
అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ప్రకటన తీవ్ర వివాదానికి దారితీసింది. లైసెన్స్ లేని కమర్షియల్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ప్రచారంలో "మా రోడ్ల పైనుంచి వెళ్లిపోండి, మీకు డ్రైవింగ్ రాదు మిస్టర్ సింగ్" అనే క్యాప్షన్‌ను ఉపయోగించారు. ఇందులో గోధుమ రంగు గడ్డంతో ఉన్న ఒక భారతీయుడి రూపాన్ని కార్టూన్ తరహాలో చిత్రీకరించి ప్రదర్శించారు. హాలీవుడ్ ప్రముఖ 'ట్రాన్స్‌ఫార్మర్స్' సినిమా శైలిని ఉపయోగిస్తూ, ఆప్టిమస్ ప్రైమ్ అనే క్యారెక్టర్ ద్వారా "మీ అంతట మీరే దేశం విడిచి వెళ్ళండి లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోండి" అని హెచ్చరిస్తున్నట్లు ఈ పోస్టర్‌ను రూపొందించారు. ఫెడరల్ ప్రభుత్వ ఏజెన్సీ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికాలోని భారతీయ అమెరికన్లు, ముఖ్యంగా సిక్కు సమాజంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహాన్ని కలిగించాయి.
అమెరికాలో దాదాపు 1,60,000 మందికి పైగా ప్రజలు 'సింగ్' అనే ఇంటిపేరును కలిగి ఉన్నారు. సింగ్ అంటే సింహం అని అర్థం, ఇది సిక్కు ధర్మంలోని గౌరవప్రదమైన గుర్తింపు. కానీ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా ప్రచారం చేయడం జాత్యాహంకార నిందలతో కూడుకున్నదని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ ఈ ఘటనపై స్పందిస్తూ, ట్రంప్ ప్రభుత్వం సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని లీగల్ ప్రాపగాండా నడుపుతోందని, ఇది అత్యంత రోత పుట్టించే చర్య అని మండిపడ్డారు. అదే విధంగా భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడూ ఒక నిర్దిష్ట జాతిని లేదా గుర్తింపును విలన్లుగా చిత్రీకరించకూడదని, ఇది సమాజంలో పగ, భయాన్ని పెంచుతుందని అన్నారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF), సిక్కు కోయలిషన్, హిందూ యాక్షన్ మరియు ఉత్తర అమెరికా హిందూ కూటమి వంటి అనేక ప్రముఖ ప్రవాస భారతీయ సంస్థలు కూడా ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించాయి.

ఈ తీవ్ర నిరసనలు, సోషల్ మీడియా ఒత్తిడి కారణంగా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఆ వివాదాస్పద ప్రకటనను చివరకు తొలగించింది. అయినప్పటికీ, ఒక ప్రభుత్వ సంస్థ జాతి లేదా పేరు ఆధారంగా ప్రజలను తప్పుగా చిత్రీకరించడం కేవలం ఆ పోస్ట్‌ను తీసివేయడంతో ముగిసిపోదని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని హెచ్‌ఏఎఫ్ డిమాండ్ చేసింది. అమెరికా ప్రభుత్వం చేపడుతున్న 'CBP హోమ్' అనే స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమంలో భాగంగా ఈ వివాదం తలెత్తింది. ఈ పథకం కింద అమెరికాను స్వచ్ఛందంగా విడిచివెళ్లే అక్రమ వలసదారులకు ప్రయాణ సహాయంతో పాటు 2,600 అమెరికన్ డాలర్ల (USD) ఆర్థిక ప్రోత్సాహకాన్ని బోనస్‌గా అందిస్తున్నారు. ఏదేమైనా చట్ట అమలు పేరుతో ఒక నిర్దిష్ట సమాజాన్ని తక్కువ చేసి చూపడం భావ ప్రకటనా స్వేచ్ఛ లేదా చట్ట పరిరక్షణ కాదని, అది జాత్యాహంకారమేనని భారతీయ సమాజం స్పష్టం చేసింది.
[US Homeland Security, DHS, Indian Americans, Sikh Community, Singh Surname, AI Advertisement Controversy, Donald Trump Administration, Gavin Newsom, Raja Krishnamoorthi, CBP Home]


