ఉగ్ర మద్దతుకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు?.. పాక్ ప్రధానిని నిలదీసిన మీడియా.!
Published on: Sat Sep 26, 2026 12:30PM

పాకిస్థాన్ ప్రధానికి చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ, తమ భూభాగాన్ని ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చిన పాకిస్థాన్ కు ఇప్పుడు అన్ని వైపుల నుంచీ వంమతిక్త వ్యక్తమౌతోంది. అమెరికాలోని ఐరాస కార్యాలయం వద్ద ఇదే విషయమై పాకిస్థాన్ ప్రధానిని జర్నలిస్టులు నిలదీశారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని అమెరికా వెళ్లారు. ఆయనను ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద మీడియా చుట్టుముట్టి ఉగ్రవాదానికి మద్దతు పై ప్రశ్నల వర్షం కురిపించింది. అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారనే అంశంపై మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నల పరంపరకు ఆయన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే ఆయన వారిని తప్పించుకు వెళ్లిపోవడం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.
పాక్ ప్రధాని ఐరాస కార్యాలయంలోకి వెడుతుండగా మీ దేశం ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడం ఎప్పుడు మానుకుంటుందంటూ ఓ జర్నలిస్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సూటిగా ప్రశ్నించాడు. ఈ అనూహ్య పరిణామంలో కంగుతిన్న షరీఫ్ సమాధానం ఇవ్వకుండా ఐరాస జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు లోనికి వెళ్లిపోయారు.

ఆ సమావేశాలు ముగించుకుని బయటకు వస్తున్న తరుణంలోనూ మీడియా ఆయనను వదలలేదు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హాఫీజ్ సయీద్‌పై మీ ప్రభుత్వం ఎప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని నిలదీసింది. అయితే దీనికీ పాకిస్థాన్ ప్రధాని నుంచి జవాబు రాలేదు. మీడియా ప్రతినిధులను తప్పించుకుని అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. అది పక్కన పెడితే.. ఐరాస జనరల్ అసెంబ్లీ వేదికగా భారత్ పాక్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భారత డిప్లొమాట్.. పొరుగు దేశం ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నదో ప్రపంచ దేశాల కళ్లకు కట్టారు. అనవసరమైన అంశాలపై దృష్టి పెడుతూ అంతర్జాతీయ వేదికలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు.
[UN General Assembly, Pakisthan PM, Shehbaz Sharif, Lashkaretoiba, Hafiz Saeed, United Nations, Pakistan Terrorism, UNGA News, Media, Questions, Telugu One]


