TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐరాస జనరల్ అసెంబ్లీలో నెతన్యాహుకు చేదు అనుభవం: ఇజ్రాయెల్ ఏకాకి అవుతోందా.?

Published on: Fri Sep 25, 2026 9:21AM

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం రసాబాసగా మారింది.  ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగిస్తున్న సమయంలో హై డ్రామా చోటు చేసుకుంది. ప్రపంచ దేశాల అగ్రనేతలను ఉద్దేశించి మాట్లాడేందుకు ఆయన పోడియం వద్దకు రాగానే, సభలో  ప్రతినిధులు పెద్ద సంఖ్యలో సామూహికంగా   వాకౌట్ చేశారు.  

ఐక్యరాజ్య సమితి పాలస్తీనా మిషన్ ఇచ్చిన ప్రత్యేక పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. నెతన్యాహు ప్రసంగాన్ని ఎవరూ వినొద్దనీ,  అందరూ సభను బహిష్కరించాలని పాలస్తీనా వర్గాలు సభ్య దేశాలకు ఇచ్చిన పిలుపు మేరకు అనేక దేశాల దౌత్యవేత్తలు, ప్రతినిధులు ఆయన ప్రసంగం ప్రారంభం వాకౌట్ చేశారు.  

ఈ   బహిష్కరణ పట్ల నెతన్యాహు తీవ్ర అసహనం, ఆగ్రహం  వ్యక్తం చేశారు. సభను వీడి వెళ్లిన వారిని ఆయన  నైతిక పిరికిపందలుగా  అభివర్ణించారు. ఇంకా ఎవరికైనా వెళ్లాలనిపిస్తే వెంటనే వెళ్లిపోవచ్చని, ఆ తర్వాతే తాను ప్రసందాన్ని కొనసాగిస్తానని   సవాల్  చేశారు.   శాంతిభద్రతలను కాపాడాలని, సభ్యులంతా సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఖలీలుర్ రెహమాన్ పదేపదే విజ్ఞప్తి చేశారు.

ఈ వివాదం మధ్యలోనే నెతన్యాహు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..  ఇరాన్,  ఇతర ప్రాంతాలలో ఇజ్రాయెల్ సైన్యం చేపడుతున్న దాడులను  సమర్థించుకున్నారు. ఇజ్రాయెల్ భధ్రత కోసం  తాము చేస్తున్న పోరాటం వాకౌట్ చేసిన దేశాలను కూడా  పరోక్షంగా రక్షిస్తోందని చెప్పుకొచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా తాము తీసుకుంటున్న కఠిన చర్యలకు పలు దేశాల అగ్రనేతలు రహస్యంగా  మద్దతు తెలుపుతున్నారని బెంజిమిన్ నెతన్యాహు చెప్పారు. 

ప్రస్తుత మిడిల్ ఈస్ట్  సంక్షోభం నేపథ్యంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న  విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వ్యక్తమౌతున్న సంగతి విదితమే.  ఇజ్రాయెల్ దూకుడు దాడులలో పౌరుల ప్రాణాలు కోల్పోతున్న వైనంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.  తరుణంలో ఈ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలలో నెతన్యాహుకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయితే.. అదే సమయంలో   నెతన్యాహుకు మద్దతుగా గ్యాలరీలో ఉన్న ఆయన అనుచరులు  అమ్ ఇజ్రాయెల్ చాయ్ అంటూ నినాదాలు చేశారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై ఇజ్రాయెల్ ఏకాకిగా మారుతోందన్న అభిప్రాయాలు విస్తృతంగా వ్యక్తమౌతున్నాయి.  ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఈ వాకౌట్ ముందు ముందు దౌత్యపరమైన సంబంధాలపై   ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు.  


[UN General Assembly, Benjamin Netanyahu, Israel Palestine conflict, UNGA walkout protest, Iran military actions, Telugu One]