ఇదేం సర్‌ప్రైజ్ బాస్: ఉద్యోగులకు ఐఫోన్లు గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ.!
Published on: Fri Sep 25, 2026 3:40PM

ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గిఫ్ట్ బాక్స్‌ల ఎంపిక పేరుతో సిబ్బందిని ఆశ్చర్యపరిచిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రముఖ సంస్థలో ఈ వినూత్న వేడుక జరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు నిషాద్ హుస్సేన్, మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ తమ సిబ్బంది కోసం ఒక ప్రత్యేకమైన బహుమతుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈవెంట్‌లో భాగంగా కార్యాలయ సమావేశ మందిరంలో టేబుల్ నిండా అందంగా ప్యాక్ చేసిన అనేక గిఫ్ట్ బాక్స్‌లను ఉంచారు. ఒక్కో ఉద్యోగి వచ్చి తమకు నచ్చిన పెట్టెను ఎంచుకోవాలని యాజమాన్యం సూచించింది. దీంతో సిబ్బంది ఎంతో ఉత్సాహంగా తమకు ఇష్టమైన బాక్స్‌లను ఎత్తుకున్నారు. వాటిని తెరిచి చూడగా కొందరికి ఖరీదైన ఐఫోన్లు లభించగా, మరికొందరి పెట్టెల్లో సాధారణ చాక్లెట్లు మాత్రమే కనిపించాయి.
ఐఫోన్లు వచ్చిన వారి ఆనందానికి అవధులు లేకపోగా, చాక్లెట్లు దక్కిన సిబ్బంది మొహాల్లో కాస్త నిరాశ ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రక్రియ అంతటితో ముగిసిపోతుందని అందరూ భావించారు. అయితే, అక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎండీ హసీనా నిషాద్ రంగంలోకి దిగి, చాక్లెట్లు మాత్రమే వచ్చిన సిబ్బంది వద్దకు స్వయంగా వెళ్లారు. వారికి కూడా సరికొత్త ఐఫోన్లను బహుమతిగా అందజేశారు.

మొదట చిన్న బహుమతితో సరిపెట్టుకున్నామని అనుకున్న ఆ సిబ్బందికి ఈ ఊహించని బహుమతి అందడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. చివరకు అందరి చేతుల్లోనూ ఐఫోన్లు మెరిశాయి. సిబ్బంది శ్రమ, అంకితభావం, ఐక్యత వల్లే కంపెనీ ఈ స్థాయికి చేరుకుందని యాజమాన్యం ఈ సందర్భంగా కొనియాడింది. ఇలాంటి విభిన్న కార్యక్రమాలు ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులోనూ కార్పొరేట్ సంస్థలు ఇలాంటి సరికొత్త విధానాలను అవలంబించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
[ UAE boss viral video, employees iphone surprise, mystery box gift game, world star holding haseena nishad, teluguone news international, Telugu One, Telugu News ]


