ఉపఎన్నికల్లో టీవీకే జోరు..నందిగ్రామ్‌లో బీజేపీ ఘన విజయం. !
Published on: Fri Oct 9, 2026 6:15PM
.webp)
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు. ఏకంగా 1,22,753 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.హసిరాణి రథ్‌కు 1,64,427 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు 41,674 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. సీపీఐ అభ్యర్థి శాంతి గోపాల్ గిరికి 5,779 ఓట్లు రాగా.. ఆలిండియా సెక్యులర్ ఫ్రంట్ అభ్యర్థి అలీ మహమ్మద్ సబీర్ మీరాజ్ ఖాన్‌కు 1,607 ఓట్లు వచ్చాయి. డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్‌కు కేవలం 853 ఓట్లు మాత్రమే లభించాయి.
ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నేరుగా పోటీ చేయలేదు. ఆ పార్టీ అభ్యర్థి సంచిత ప్రధాన్ డే చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేకపోయారు.నందిగ్రామ్ ఉప ఎన్నికలో బీజేపీ సాధించిన ఈ భారీ మెజారిటీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో అధికార త్రిమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో విజయపథంలో దూసుకుపోయారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని ఈ యువ పార్టీ తన సత్తాను మరోసారి బలంగా చాటుకుంది. మధురాంతకం, ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్‌లో టీవీకే అభ్యర్థులు మొదటి నుంచి ప్రత్యర్థులపై బలమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ధరాపురం స్థానంలో టీవీకే అభ్యర్థి పీ సత్యభామ తన సమీప ప్రత్యర్థిపై సుమారు పది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

మరోవైపు మధురాంతకం నియోజకవర్గంలోనూ టీవీకే అభ్యర్థి కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ వచ్చారు. డీఎంకే మరియు అన్నాడీఎంకే పార్టీల గట్టి పోటీని ఎదుర్కొంటూ అధికార పార్టీ అభ్యర్థులు సాధించిన ఈ విజయాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.ఈ ఎన్నికల ఫలితాలపై అధికార పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ విధానాలకు, ఆయన నాయకత్వ శైలికి ఈ ఫలితాలు ప్రజలు అందించిన బలమైన నిదర్శనమని టీవీకే శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. మెజారిటీపై ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రజలు పట్టం కట్టారని నేతలు పేర్కొన్నారు.
మరోవైపు పొరుగున ఉన్న పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోనూ రాజకీయ వేడి రాజుకుంది. అక్కడ జరిగిన తట్టాన్‌చావడి అసెంబ్లీ ఉపఎన్నికలో ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షమైన ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) అభ్యర్థి అశోక్ ఆనంద్ అఖండ విజయం సాధించారు.ఈ స్థానంలో ఏఐఎన్‌ఆర్‌సీ అభ్యర్థి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై సుమారు ఎనిమిది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ప్రాతినిధ్యం వహించి, అనంతరం వదులుకున్న ఈ స్థానంలో ఎన్డీయే కూటమి తన పట్టును నిరూపించుకోవడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఉపఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ భవిష్యత్ ఎన్నికలకు దిశ నిర్దేశం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
[ TVK bypoll victory, Tamil Nadu politics, Puducherry by-election, AINRC win, Joseph Vijay, Thattanchavady bypoll results, Hasirani Rath, Nandigram Bypoll Results, West Bengal BJP Victory, Suvendu Adhikari, Nandigram Assembly Election, West Bengal Politics ]


