TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పసుపే బంగారమాయెగా: ధరల ఆల్ టైమ్ రికార్డు.. రైతుల్లో ఆనందోత్సాహాలు.!

Published on: Thu Oct 15, 2026 1:46PM

పసుపు ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకోవడంతో   రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమ వుతున్నాయి. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో పసుపు ధర క్వింటాల్‌కు ఏకంగా   పాతిక వేల రూపాయల మార్క్ కు చేరువైంది.  ప్రస్తుతం మార్కెట్‌కు పసుపు రాక తగ్గడం, అంతర్జాతీయంగా డిమాండ్  పెరగడమే ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో పసుపు కొమ్ముల సగటు ధర క్వింటాలుకు రూ. 13 వేల నుంచి  19 వేల 500 రూపాయల వరకూ  పలుకుతున్నాయి. సగటు ధర  16 వేల397 రూపాయలుగా స్థిరపడింది. 

తెలంగాణలోని  నిజామాబాద్ మార్కెట్లో ఫింగర్ రకం పసుపు క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 19 వేల166 రూపాయలుగా ఉంది.  బల్బ్ రకానికి  18 వేల600 రూపాయల  ధర లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని దుగ్గిరాల మార్కెట్లో క్వింటాలు 18 వేల 400 రూపాయలు, కడపలో  18 వేల115 రూపాయల చొప్పున పలుకుతోంది.  

అదే విధంగా తమిళనాడులోని ఈరోడ్ కేంద్రంలో సేలం ప్రీమియం క్వాలిటీ పసుపు క్వింటాలుకు రూ. 15 వేల500 నుంచి   19 వేల 500 రూపాయల వరకూ ధర పలుకుతోంది.  అదే విధంగా మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో రాజపురి రకం పసుపు ధర్వ  క్వింటాలు   17 వేల 500 రూపాయలు,  ఢిల్లీలోని ఖారీ బావలీలో గట్టా రకం పసుపు క్వింటాలు 21 వేల 500 రూపాయలు ధర పలుకుతోంది. 

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక క్యుర్క్యుమిన్ పరిమాణం కలిగిన లాకాడోంగ్ రకం ప్రీమియం పసుపు హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాలుకు  20 వేల నుంచి 32 వేల రూపాయల పైచిలుకు ధరలను రాబడుతుంన్నది. మార్కెట్‌కు వచ్చే పసుపులోని తేమ శాతం, నాణ్యత, రంగు,  రోజువారీ లోడ్లను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటున్నాయి. దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఎగుమతులు పుంజుకోవడంతో రాబోయే రోజుల్లో కూడా పసుపు ధరలు మరింత పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల వేడి రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరటను కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

[Turmeric Price, Turmeric Price Quintal Rs 25000 Agricultural Market Rates, Turmeric Farmers, Turmeric Trade Demand]