వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..తొలిరోజు పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి కనువిందు.!
Published on: Mon Oct 12, 2026 8:34PM

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు నిర్వహించిన వాహన సేవలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ గోవిందరాజస్వామి అలంకారంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. హిందూ సంప్రదాయంలో ఆదిశేషుడికి విశిష్ట స్థానం ఉంది. శ్రీమహావిష్ణువుకు శేషుడు అత్యంత సన్నిహితుడు. స్వామివారికి పాన్పుగా, వాహనంగా సేవలందిస్తూ ఆదిశేషుడు తన దాస్యభక్తిని చాటుకుంటాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమహావిష్ణువుకు సన్నిహితంగా ఉన్న ఆదిశేషుడి వైభవాన్ని చాటిచెప్పేలా పెద్దశేష వాహన సేవ నిర్వహించారు. వాహన సేవ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

భక్తుల గోవింద నామస్మరణ, మంగళవాయిద్యాల నడుమ సాగిన స్వామివారి ఊరేగింపు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలతో పాటు భక్తుల రాకపోకలు, క్యూలైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవాలు ముగిసే వరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో సంబంధిత విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సేవలందిస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరుస వాహన సేవలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
[ TTD, Tirumala, Tirumala Brahmotsavam 2026, Srivari Navaratri Brahmotsavams, Malayappa Swamy, Pedda Sesha Vahanam, Lord Venkateswara, Tirumala Temple, TTD News, Srivari Vahana Seva, Govinda Namalu, Tirumala Devotees, Tirumala Latest News, Andhra Pradesh News ]


