TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..!

Published on: Wed Sep 2, 2026 2:29PM

 

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏకకాలంలో తనిఖీలు..!

టీటీడీలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈవో) ఎం. లోకనాథంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం నుంచి లోకనాథం నివాసం, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏడు బృందాలు తనిఖీల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఉదయం 6 గంటలకే అధికారులు తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం నివాసానికి చేరుకుని సోదాలు ప్రారంభించారు. ఆ సమయంలో లోకనాథం ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో తిరుమలలోని లోకనాథం కార్యాలయంలోనూ మరో బృందం తనిఖీలు చేపట్టింది. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు యెర్పేడు మండలం చెల్లూరు ప్రాంతంలోని ఆయన బంధువుల నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. తిరుమలలో లోకనాథంకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఓ గెస్ట్‌హౌస్‌లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

దర్యాప్తులో భాగంగా తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఉన్న లోకనాథం బ్యాంకు లాకర్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు తదితర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం లోకనాథం శ్రీవారి ఆలయ టెంపుల్ డిప్యూటీ ఈవోగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలోనూ టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేశారు.

గత దశాబ్ద కాలంలో టీటీడీ ఉన్నతాధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి. 2016లో అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి. భూపతి రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో ఆయనకు సంబంధించిన పలు ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం లోకనాథం ఆస్తులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల పత్రాలు, ఇతర వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.

 

TTD, Tirumala Tirupati Devasthanams, TTD Deputy EO, M Lokanatham, Lokanatham, ACB Raids, ACB Searches, Anti Corruption Bureau, Tirumala, Tirupati, Temple Deputy EO, Disproportionate Assets, DA Case, Corruption Allegations, ACB Searches, TTD Corruption, Tirumala News, Telugu One, Telugu news