TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రష్యాపై మరిన్ని ఆంక్షలు.. బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇండియా పరిస్థితేంటి?

Published on: Sat Sep 19, 2026 11:39AM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంతర్జాతీయ రాజకీయాలు, వాణిజ్య సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. తాజాగా రష్యాపై మరిన్ని ఆంక్షలు మోపే బిల్లుపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.  ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా.  ఈ సంతకం ద్వారా  మాస్కోకు నిధులు సమకూర్చే కీలక రంగాలపై ఆంక్షల ఉచ్చు బిగుసుకుంది. 

ప్రతినిధుల సభతో పాటు సెనేట్  ఆమోదించిన ఈ  చట్టం..  రష్యా రక్షణ,  ఇంధన రంగాలను ప్రధానంగా టార్గెట్ చేసింది. అదే విధంగా ప్రస్తుత ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న  షాడో ఫ్లీట్' ట్యాంకర్ల కదలికలపై నిఘా పెంచడంతో పాటు వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. యుద్ధానికి అవసరమైన నిధులను మాస్కోకు అందకుండా నిరోధించడమే ఈ చట్టం లక్ష్యం. కాగా ఈ బిల్లులో పొందుపరిచిన కొన్ని నిబంధనలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో  కలకలం రేపుతున్నాయి.

ఈ కొత్త చట్టం ప్రకారం రష్యా నుంచి భారీగా ముడిచమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అమెరికా  వంద శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఈ కొత్త చట్టం ప్రభావం భారీగా ఉంటుంది.  హంగేరీ, అజర్ బైజాన్, స్లోవేకియా వంటి ఇతర దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆ దేశాలపై కూడా మోయలేని భారం పడుతుంది.  

గత కొంతకాలంగా రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు నిలిపివేయాలని లేదా తగ్గించాలని భారత్‌ను అమెరికా పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేశీయ ఇంధన అవసరాల దృష్ట్యా భారత్ తన వాణిజ్య విధానాన్ని స్వతంత్రంగా కొనసాగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడి సంతకంతో అమలులోకి వచ్చిన కొత్త చట్టం భారత్ పై పెను భారం మోపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.   వంద శాతం టారిఫ్‌ల విధింపు అమల్లోకి వస్తే అమెరికాకు ఎగుమతి అయ్యే ఇండియన్ గూడ్స్  ధరలు అమాంతంగా పెరిగిపోతాయి. ప్రధానంగా  ఐటీ, ఔషధాలు, ఇంజనీరింగ్,  టెక్స్‌టైల్స్ రంగాలపై సుంకాల భారం తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది.  


[Trump Russia Sanctions Bill, US Tariffs on India, Russian Oil Imports India China, Donald Trump News, US Russia Relations 2026]