TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ కష్టాలు

Published on: Thu Jun 11, 2026 2:42PM

తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ పెట్టి టీఆర్ఎస్ బ్రాండ్ ఓన్ చేసుకుందామనుకున్న కవితకు ఆ పేరే  ఇప్పుడు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. టీఆర్ఎస్ పేరును కేటాయించవద్దని ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.  అదలా ఉంటే.. మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న  తెలంగాణ రాష్ట్రసామాజిక సేన  టీఆర్ఎస్ పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. ఇక కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.

అంతేకాకుండా, కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ పేరును ఆమె పార్టీకి కేటాయించడంపై దాదాపు 600 నుంచి 700 వరకు  అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే  టీఆర్ఎస్ పేరుతో నమోదైన మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో రాజకీయ పార్టీ కూడా టీఆర్ఎస్ పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం కూడా ఈసీని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో కవిత పార్టీకి టీఆర్ఎస్ సెంటిమెంట్ దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.