TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తృణమూల్ గుర్తు మమత, రితబ్రత వర్గాల్లో ఎవరికి దక్కుతుంది?

Published on: Fri Sep 18, 2026 11:06AM

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొంతకాలంగా   ఉత్కంఠను రేకెత్తిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు  ఎన్నికల గుర్తు వివాదం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వర్గం,  తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ వర్గాల మధ్య ఏర్పడిన  విభేదాలు.. పార్టీ గుర్తు  ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం గురువారం (సెప్టెంబర్ 16) మధ్యాహ్నం మొదటగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ సమావేశం అనంతరం రితబ్రత మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాము   సమాధానాలు ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ పేరు, అధికారిక గుర్తుపై తమ వద్ద ఉన్న బలమైన వాదనలను కమిషన్ ముందు  ఉంచామని, ఈసీఐపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, తీర్పు తమ వైపే మొగ్గు చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది, ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఈసీఐ ఎదుట తమ వాదనలను గట్టిగా వినిపించారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం కోరిన అన్ని కీలక పత్రాలను తాము  సమర్పించామని తెలిపారు. తాము సమర్పించిన ఆధారాలు, వాదనల ఆధారంగా అంతిమ నిర్ణయం తమకే అనుకూలంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  

ఇంతకు ముందు అంటే సెప్టెంబర్ 12వ తేదీన కూడా ఈసీఐ ఇరు వర్గాల వాదనలను విన్నది. ఆ సమయంలో ఎటువంటి తక్షణ నిర్ణయం తీసుకోకుండా, తదుపరి విచారణ నిమిత్తం కొన్ని అదనపు పత్రాలను సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ వివాదంపై ఈసీఐ ఒకవేళ తుది నిర్ణయం వెలువరించినప్పటికీ, ఈ పోరాటం ఇక్కడితో ముగిసే అవకాశం లేదు. తీర్పు వ్యతిరేకంగా వచ్చిన వర్గం న్యాయపోరాటం కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 


[Trinamool Congress, West Bengal, Mamata Banerjee, Ritabrata Banerjee, ECI, TMC symbol dispute, Telugu One]