వెడ్డింగ్ డెస్టినేషన్ తిరుమల, తిరుపతి.!
Published on: Wed Sep 16, 2026 4:56PM

సంక్షోభాలలోనే అవకాశాలను అణ్వేషించడం, ఏమీ లేని స్థితిలో కూడా అద్భుతాలను సాధించడం ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి వెన్నతో పెట్టిన విద్య. పేరు తప్ప ఇంకేమీ మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ ను దేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా మార్చేందుకు అరహారం శ్రమపడిన, పడుతున్న చంద్రబాబు ఇప్పుడు తాజాగా తిరుమల, తిరుపతిని వెడ్డింగ్ డెస్టినేషన్ గా మార్చేందుకు ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తున్నారు. తిరుమల, తిరుపతిని వెడ్డింగ్ డెస్టినేషన్లుగా తీర్చిదిద్దే సమగ్ర ప్రణాళికను ఆయన స్వయంగా ప్రకటించారు.
వెడ్డింగ్ డెస్టినేషన్ గా తిరుమల, తిరుపతి అన్న చంద్రబాబు ఆలోచన ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే తిరుమల వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల ప్రాంతానికి ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందన్న సంగతి తెలిసిందే. తిరుమలలో వివాహం చేసుకోవడాన్ని ఒక సంప్రదాయంగా భావించే కుటుంబాలు ఉన్నాయి. తిరుమలలో పెళ్లి చేసుకోలేకపోయినా... వివాహం తరువాత నూతన వధూవరులు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం విధాయకంగా భావిస్తారు. అటువంటిది తరుపతి, తిరుమలనే వెడ్డింగ్ డెస్టినేషన్ అంటే.. ఈ ఆలోచన స్వాగతించదగినదిగా ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే తిరుమల వెడ్డింగ్ డెస్టినేషన్ అన్న దానిపై ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రోత్సహిస్తే ఇది.. విస్తృత ప్రాచుర్యం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఉదాహరణకు.. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తరచుగా తిరుపతి గురించి, అక్కడ వివాహం చేసుకోవాలనే తన కోరిక గురించి ప్రస్తావిస్తుంటారు. ప్రభుత్వం, ప్రచార విభాగం నుండి తగిన మద్దతు లభిస్తే, ఆమె వివాహం ఇక్కడ జరిగేలా చూడటం చంద్రబాబు ప్రతిపాదించిన ఈ కార్యక్రమానికి గొప్ప ఊతాన్నిచ్చే పరిణామం అవుతుంది. భారతదేశంలో వివాహ రంగం అతిపెద్ద ఆర్థిక వనరులలో ఒకటి. చంద్రబాబు రూపొందించిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగితే, దీనికి అపారమైన అవకాశాలు ఉంటాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని సమర్థవంతంగా అమలు చేస్తే, ఇది ఆర్థిక ప్రాజెక్టుగా మారుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఇక అంతా దీని అమలు పైనే ఆధారపడి ఉంటుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రంగా భావించే తిరుపతి ప్రాంతాన్ని కేవలం భక్తుల రాకపోకలకే పరిమితం చేయకుండా, దేశ విదేశాల నుంచి వచ్చే కుటుంబాలు తమ వివాహాది శుభకార్యాలను వైభవంగా నిర్వహించుకునేలా గమ్యస్థానంగా మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. తిరుమల, తిరుపతి నగరంలో ఉన్న జలవనరులు, చెరువులను సుందరీకరించడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడటంతో పాటు పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు విశ్వసిస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక అమలు కోసం సంబంధిత పర్యాటక శాఖాధికారులు, స్థానిక యంత్రాంగం, టీటీడీ సహకారంతో ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తిరుపతిలో, తిరుమలలో అందుబాటులో ఉన్న కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్, ప్రైవేట్ వివాహ వేదికలను ఒక వ్యవస్థ కిందకు తీసుకువచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, వసతి, క్యాటరింగ్ తదితర సేవలను నాణ్యతతో అందించేలా సర్వీస్ ప్రొవైడర్లను కూడా ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములను చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయ హిందూ వివాహ పద్ధతులు ఉట్టిపడేలా.. అదే సమయంలో ఆధునిక హంగులతో కూడిన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఈ ప్రణాళికలు రూపొందుతున్నాయని చంద్రబాబు వివరించారు. కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, తెలుగు ఎన్.ఆర్.ఐలు, ఇతర దేశాల నుంచి వచ్చే హిందూ కుటుంబాలు తిరుపతిని మేరేజ్ డెస్టినూషన్ గా ఎంచుకునేందుకు అవసరమై, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ తిరుపతి, తిరుమల డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.
[Tirupati wedding destination, Chief Minister Chandrababu Naidu, Infrasrtucture, Develope, NRI, Celebreties, Prestgious, Project]


