ఎస్వీ మ్యూజియంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.!
Published on: Wed Sep 16, 2026 2:22PM

తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత ఇనుమడింపజేసేలా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎస్వీ మ్యూజియంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (సెప్టెంబర్ 16) ప్రారంభించారు. శ్రీవారి సార్వభౌమత్వాన్ని, తిరుమల చరిత్రను, అరుదైన సాంస్కృతిక విశేషాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ మ్యూజియాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ముస్తాబు చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు అనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మ్యూజియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ గ్యాలరీలను చంద్రబాబు పరిశీలించారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ఆధారిత శ్రీవారి దర్శన అనుభూతిని ముఖ్యమంత్రి స్వయంగా వీక్షించి, మ్యూజియం పనితీరును అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ జోడించినట్లు అధికారులు వెల్లడించారు.జీ ప్లస్ 3 అంతస్తుల విశాలమైన భవనంలో రూపుదిద్దుకున్న ఈ ఎస్వీ మ్యూజియంలో మొత్తం 19 ప్రత్యేక గ్యాలరీలు, సుమారు 14 వేలకు పైగా అరుదైన కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా బాపు, కృష్మారావు వంటి ప్రసిద్ధ కళాకారులు తీర్చిదిద్దిన అద్భుతమైన వర్ణచిత్రాలు, దశావతారాల ఘట్టాలు, విరాట్ పురుషుని రూపాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే, తాళ్లపాక అన్నమాచార్యులు రాగి రేకులపై నిక్షిప్తం చేసిన పవిత్ర భక్తి గీతాలు, చరిత్రకు సాక్ష్యంగా నిలిచే పురాతన నాణేలు, తిరుమల గత వైభవానికి సంబంధించిన అరుదైన ఛాయాచిత్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సందర్శకుల సౌకర్యార్థం ఈ మ్యూజియంలో మోషన్ సెన్సార్ లైటింగ్ వ్యవస్థను అమర్చారు. దీనివల్ల మ్యూజియంలో ఎక్కడైతే సందర్శకులు ఉంటారో అక్కడ మాత్రమే లైట్లు వెలిగేలా అత్యాధునిక ఆటోమేటెడ్ సాంకేతికతను వాడారు. భక్తుల రాకపోకల కోసం హైస్పీడ్ ఎలివేటర్లు, విశాలమైన ఏసీ గ్యాలరీలు, అత్యాధునిక విశ్రాంతి గదులు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా మ్యూజియం లోపలికి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, పాదరక్షలను అనుమతించబోమని, వాటిని భద్రపరుచుకోవడానికి ప్రత్యేకంగా లాకర్ సౌకర్యం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు.
వార్షిక బ్రహ్మోత్సవాల వేళ ఈ మ్యూజియం ప్రారంభంకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమలకు విచ్చేసే భక్తులు కేవలం స్వామివారి దర్శనంతో సరిపెట్టుకోకుండా, ఇక్కడి చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక సంపదను కళ్లకు కట్టినట్లు తెలుసుకునేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. ఇదే పర్యటనలో భాగంగా రిలయన్స్, భారత్ సంస్థలు విరాళంగా అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సుల జెండా ఊపి ప్రారంభించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు ఈ ఈవీ బస్సుల ప్రయాణం ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు.భవిష్యత్తులో తిరుమలకు వచ్చే పర్యాటకులు, భక్తుల సంఖ్య మరింత పెరగనున్న నేపథ్యంలో, వారికి మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా పాలకమండలి ముందుకు వెళ్తోంది. డిజిటల్ మరియు వర్చువల్ అనుభవాలను జోడించడం ద్వారా యువతను, ఆధ్యాత్మిక ప్రియులను ఈ మ్యూజియం విశేషంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
[Tirumala SV Museum, Chief Minister Chandrababu Naidu, Tirumala Brahmotsavam, TTD Museum inaugurated Tirumala, Telugu One]


