TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భక్త జన సందోహంతో కిటకిట లాడుతున్న తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు.!

Published on: Wed Sep 30, 2026 10:18AM

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో నిత్యం భక్త జనసందోహంతో కిటకిటలాడే తిరుమలలో గత కొంత కాలంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరువాత కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెవలు దినాలు, పర్వదినాలు అన్న తేడా లేకుండా తిరుమల భక్త జనకోటితో కిక్కిరిసిపోతోంది.  

బుధవారం (సెప్టెంబర్ 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భకక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి.. క్యూలైన్ వెలుపలి వరకూ విస్తరించింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగడానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఈ నేపథ్యంలో  క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు ఇబ్బంది కలగకుండా  టీటీడీ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది.

టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటూ భక్తులకు నిరంతరం సేవలందిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న వారికి మంచినీరు, పాలు,  అన్నప్రసాదాలను క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారు. అలాగే అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణ వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇక మంగళవారం (సెప్టెంబర్ 29)  శ్రీవారిని మొత్తం  77వేల 082 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 039 మంది తమ తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం   4 కోట్ల పాతిక లక్షల రూపాయలు వచ్చింది.  వారపు రోజుల్లోనూ భక్తుల తాకిడి ఇలాగే కొనసాగుతుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం ( అక్టోబర్ 2) గాంధీ జయంతి సెలవు, ఆ తరువాత వారాంతం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.  

[Tirumala Pilgrim Rush, Srivari Sarva Darshanam,  Waiting Time, 24 Hours, Tirumala Tirupati Devasthanam, Vaikuntam Queue Complex, Hundi Income, Telugu One]