12 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష.!
Published on: Tue Oct 6, 2026 10:47AM

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాట ఏర్పాట్లపై టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఇతర ఉన్నతాధికారులతో కలిసి తిరుమల అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, టీటీడీ జేఈవోలు, సీవీఎస్వోతో పాటు వివిధ విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గత నెలలో నిర్వహించిన సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి ఏర్పాట్లను మరింత మెరుగుపరచాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు గతంతో పోలిస్తే సుమారు పాతిక నుంచి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. వరుస సెలవులు, పెరటాసి మాసం నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి విభాగాలను అప్రమత్తం చేశారు.
వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి వాహన సేవలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో భద్రత పరంగా ఎటువంటి లోటుపాట్లూ లేకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో అన్నప్రసాదం, పారిశుధ్యం, వైద్య సేవలు, రవాణా, పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, విజిలెన్స్, పోలీసు భద్రత వంటి అంశాలపై టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుపతిలోని వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కోఆర్డినేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గత నెల సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో ఎదురైన అనుభవాలను కూడా అధికారులు సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు ఎదురైన అంశాలు, ఏర్పాట్లలో ఉన్న లోటుపాట్లను గుర్తించి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఆదేశించారు. పోలీసు, జిల్లా యంత్రాంగం, టీటీడీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
[Tirumala Navaratri Brahmotsavams, TTD Tirumala, Srivari Brahmotsavam, Tirumala Devotees, TTD arrangements, Review Meeting, Telugu One]


