TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో పరకామణి విధానంలో సరికొత్త మార్పులు.. టీటీడీ కసరత్తు.!

Published on: Sat Oct 10, 2026 2:36PM

 

శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!

తిరుమల తిరుపతి శ్రీవారి హుండీ లెక్కింపు ప్రక్రియలో ఆటోమేషన్‌ను పెంపొందించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. పరకామణి విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చి, లెక్కింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న పరకామణి కుంభకోణం నేపథ్యంలో లెక్కింపులో మానవ ప్రమేయాన్ని వీలైనంత తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులు హుండీలో కరెన్సీ నోట్లు, నాణేలు, బంగారం, వెండి ఆభరణాలు, వివిధ రకాల పత్రాలను కానుకలుగా సమర్పిస్తుంటారు. 

ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో సుమారు 250 నుంచి 300 మంది కార్మికులు నిమగ్నమవుతున్నారు.శ్రీవారి హుండీకి సగటున రోజుకు 150 నుంచి 220 బస్తాల నాణేలు, భారీగా కరెన్సీ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతటి భారీ మొత్తంలో వచ్చే కానుకలను లెక్కించడం సిబ్బందికి శ్రమతో కూడుకున్న పని కావడంతో ఆటోమేషన్‌పై టీటీడీ దృష్టి సారించింది.హుండీలో వచ్చే కరెన్సీ నోట్లు, నాణేలు, బంగారు ఆభరణాలను యంత్రాల ద్వారా ఆటోమేటిక్‌గా వేరు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది. 

ఇప్పటికే శ్రీవారి హుండీలోని 14 రకాల నాణేలను లెక్కించేందుకు జర్మనీ నుంచి వచ్చిన రెండు అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ యంత్రాల వినియోగంతో లెక్కింపు ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు మానవ ప్రమేయం తగ్గి, అవకతవకలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వందలాది మంది కార్మికులు పాల్గొంటున్న హుండీ లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది అవసరాన్ని గణనీయంగా తగ్గించాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సుమారు 100 మంది చేసే పనిని 15 నుంచి 20 మంది సిబ్బంది పర్యవేక్షణలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు అమలుకు సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఈ ప్రాజెక్టుపై టీటీడీ అధికారులు సమావేశం కానున్నారు. ఆటోమేషన్ విధానం అమలు, యంత్రాల వినియోగం, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించి తదుపరి కార్యాచరణను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. తొలుత తిరుమలలో ఈ నూతన విధానాన్ని అమలు చేసి, అనంతరం తిరుపతిలోని సంబంధిత ఆలయాలకు కూడా విస్తరించాలని టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే హుండీ లెక్కింపు మరింత వేగంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తిరుమల శ్రీవారికి భక్తులు విలువైన కానుకలను సమర్పించారు. ఇందులో భాగంగా జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు శనివారం శ్రీవారికి రూ.51.55 లక్షల విలువైన బంగారు లాకెట్, ముత్యాలహారాన్ని విరాళంగా అందించారు. వీటిలో రూ.44.35 లక్షల విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్‌తో పాటు.. రూ.7.20 లక్షల విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన మూడు వరుసల ముత్యాలహారం ఉన్నాయి. ఈ హారం బరువు 27 గ్రాములు.ఈ ఆభరణాలను తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు దాత ఆర్తి బిందాల్ దంపతులు అందజేశారు.

 

 

[ Tirumala Lord Venkateswara, Aarti Bindal, TTD Chairman BR Naidu, Jaipur couple donation, BIRRD Trust, Tirumala Tirupati Devasthanams, Parakamani, CM Chandrababu, Naralokesh ]