TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

TTD: చిరుతల కదలికలపై నిఘా.. తిరుమల నడకమార్గంలో రంగంలోకి రోబో డాగ్.!

Published on: Sat Oct 10, 2026 5:08PM

తిరుమలకు కాలినడకన చేరుకునే భక్తుల భద్రతపై టీటీడీ అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయం కావడంతో చిరుతల సంచారం పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో చిరుతల కదలికలను గుర్తించేందుకు రోబో డాగ్‌ను రంగంలోకి దించారు.గాలిగోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు చిరుతల సంచారం అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

దీంతో నడకమార్గానికి ఎడమవైపున సుమారు 25 మీటర్ల మేర పెరిగిన గడ్డి, పొదలు, ఇతర వ్యర్థాలను తొలగించారు. భక్తులకు దూరం నుంచే వన్యప్రాణుల కదలికలు కనిపించేలా సుమారు రెండు కిలోమీటర్ల మేర వ్యూ లైన్స్‌ను కూడా క్లియర్ చేశారు.నడకమార్గంలో చిరుతలతో పాటు ఇతర వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి, భద్రతా చర్యలు చేపట్టేందుకు రోబో డాగ్‌తో నిఘా ఏర్పాటు చేశారు. చిరుతల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు, చిన్నపిల్లల భద్రత విషయంలోనూ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పదేళ్లలోపు పిల్లలకు మధ్యాహ్నం 3 గంటలలోపే నడకమార్గంలో అనుమతి కల్పిస్తున్నారు. చంటిపిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలిపెట్టవద్దని మైకుల ద్వారా తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సాయంత్రం 6 గంటలకల్లా నడకమార్గాన్ని మూసివేస్తున్నారు. భక్తులు టీటీడీ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా తిరుమల చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

 

 

[ Tirumala Leopard News, TTD, Robot Dog, Tirumala Footpath, Leopard Movement, Tirumala Devotees Safety, TTD Forest Department, Alipiri Walkway, Wildlife Monitoring, Tirumala Latest News, Leopard Alert, TTD Safety Measures, Tirumala Walking Path, Tirupati News, Andhra Pradesh News ]