భక్త జన సంద్రంగా తిరుమల: సర్వదర్శనానికి 20 గంటలు.. నిండిపోయిన క్యూ కాంప్లెక్స్ లు.!
Published on: Thu Sep 24, 2026 11:58AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల భక్త జనసంద్రంగా మారిపోయింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కూడా ఒక్క సారిగా భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. గురువారం (సెప్టెంబర్ 24) ఉదయం వైకుంఠం కాంప్లెక్స్ లోకి కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.
భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూలైన్లలో వేచి ఉండే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ కంపార్ట్‌మెంట్లు మరియు క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా జల ప్రసాదం, పాలు, అన్నప్రసాదాలను అందిస్తున్న అంతేకాకుండా భక్తుల ఆరోగ్య రక్షణ కోసం వైద్య సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచారు.

మరోవైపు.. తిరుమల శ్రీవారిని బుధవారం 67 వేల 632 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24 వేల 909 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 91 లక్షల రూపాయలు వచ్చింది.వారాంతం సమీపిస్తున్న నేపథ్యంలో రానున్న రోజులలో కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భక్తులు ఎటువంటి అవాంఛనీయ ఇబ్బందులకు గురికాకుండా, దర్శన సమయాన్ని క్షుణ్ణంగా బేరీజు వేసుకుని, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
[Tirumala Devotees Rush, Tirumala Sarva Darshan, TTD News, Tirumala Hundi Income, Srivari Darshanam, Telugu One]


