TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హంస వాహనంపై జ్ఞానస్వరూపుడిగా శ్రీ మలయప్పస్వామి..!

Published on: Wed Sep 16, 2026 8:30PM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం రాత్రి హంస వాహనసేవ వైభవంగా జరిగింది. శ్రీ మలయప్పస్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో, చేతిలో వీణను ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంస వాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వాహనసేవ సందర్భంగా తిరుమాడ వీధులు భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. మంగళవాయిద్యాలు, వేదఘోషలు, భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలు వాహనసేవకు మరింత శోభను తీసుకొచ్చాయి. కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి.

జ్ఞానానికి ప్రతీక హంస వాహనం..!

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానస్వరూపుడిగా దర్శనమిస్తారని పురాణాలు, ఐతిహ్యాలు చెబుతున్నాయి. హంస బ్రహ్మదేవుని వాహనంగా, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. పాలు–నీళ్లను వేరు చేయగల హంస స్వభావం వివేకానికి, ఆత్మ–అనాత్మ విచక్షణకు సంకేతంగా పేర్కొంటారు. పరమాత్మ తత్వాన్ని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయులను ఉపనిషత్తులు ‘పరమహంసలు’గా అభివర్ణిస్తాయి. ఈ నేపథ్యంలో హంస వాహనసేవ భక్తుల్లోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వివేకజ్ఞానాన్ని ప్రసాదించి, ఆధ్యాత్మిక ఉన్నతికి చేర్చే సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది.

గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమలలో హంస వాహనంపై జ్ఞానస్వరూపుడిగా వెలసిన శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచింది. ఈ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి,  చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 [ Tirumala, Tirupati, Lord Malayappa Swamy, Hamsa Vahanam, Hamsa Vahana Seva, Tirumala Brahmotsavam, TTD, Saraswati Alankaram, Lord Venkateswara, Tirumala Temple, Brahmotsavam 2026, Devotees, Govinda Namam, Tirumala Utsavam ]