థైరాయిడ్ వల్ల డబుల్ చిన్ వస్తుందా.. కారణాలు, తగ్గించే మార్గాలు.!
Published on: Mon Oct 5, 2026 10:30AM
గొంతుకు, గడ్డానికి మధ్య భాగంలో , గడ్డానికి కింద చర్మం, కండర కణజాలం పెరిగి.. గొంతు, గడ్డం ఏకం అయినట్టు చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని డబుల్ చిన్ అని అంటారు. లావు పెరగడం వల్ల డబుల్ చిన్ వచ్చిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే లావు ఎక్కువగా లేకపోయినా కొందరిలో డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే డబుల్ చిన్ కు, థైరాయిడ్ సమస్యలకు మధ్య ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
డబుల్ చిన్ ఎందుకు, ఎలా వస్తుంది?
థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేనప్పుడు శరీర జీవక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో బరువు వేగంగా పెరగడం, శరీరంలో నీరు చేరడం లేదా వాపులు రావడం సాధారణం. దీని ప్రభావం ముఖం , మెడ భాగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. మెడ కింద కొవ్వు చేరడం లేదా ముఖం ఉబ్బినట్లు అవ్వడం వల్ల డబుల్ చిన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్య వల్ల మెడ ముందు భాగంలో ఉన్న గ్రంథి వాచి గాయిటర్ గా మారినప్పుడు కూడా గడ్డం కింద వాపు వచ్చి డబుల్ చిన్ లాగా కనిపించే అవకాశం ఉంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు డబుల్ చిన్ తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు , జీవనశైలి మార్పులు పాటించాలి..
థైరాయిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం..
థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వాడాలి. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవక్రియ వేగవంతమై, అదనపు బరువు , వాపు తగ్గుతాయి.
పోషకాహార నియమం..
ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, మైదా , వేపుళ్లను పూర్తిగా తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు , తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలో సోడియం నిల్వలు ఎక్కువైతే నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి ఉప్పు చాలా పరిమితంగా తినాలి.
నీరు..
ప్రతిరోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నీరు బాగా తాగితే ముఖం , మెడ భాగంలో నీరు చేరడం తగ్గి వాపు తగ్గుతుంది.
వ్యాయామం..
కేవలం మెడ భాగంలోనే కాకుండా శరీరం మొత్తానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. దీనితో పాటు మెడ , గడ్డం కండరాలను బలోపేతం చేసే చిన్న చిన్న ముఖ వ్యాయామాలు చేయవచ్చు. ఈ ఫేస్ వ్యాయామాలు మెడ వద్ద ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడానికి తోడ్పడతాయి.
నిద్ర , ఒత్తిడి..
రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలేమి , మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం వంటివి పాటించాలి.
పైన చెప్పుకున్న విధంగా థైరాయిడ్ కు సరైన వైద్యం పొందుతూ, ఆరోగ్యకరమైన ఆహారం , రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకుంటే డబుల్ చిన్ సమస్య నుండి క్రమంగా బయట పడవచ్చు.



