TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తుమ్మిడిహట్టికి అనుమతులు ఇప్పించండి: కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి.!

Published on: Tue Sep 29, 2026 9:56PM

 తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. అలాగే రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ, ఇతర అనుమతులను త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఢిల్లీలో మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించారు.

తుమ్మిడిహట్టి బ్యారేజీపై కీలక చర్చ..!

తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్‌ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా చూడాలని సీఎం కోరారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. +152 మీటర్ల స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ఆధారంగా ఎల్లంపల్లికి నీటిని తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో నీటి తరలింపునకు అవసరమైన విద్యుత్ వినియోగం, వ్యయం తగ్గుతుందని వివరించారు.

పర్యావరణ అనుమతులు ఇవ్వాలి..!

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్‌), డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్‌ఐఎస్‌), సీతారామ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పర్యావరణ అనుమతులకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనున్నందున, ఆయా ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. అనుమతుల జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు.

సమ్మక్కసాగర్‌కు అనుమతులపై విజ్ఞప్తి..!

సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని సీఎం కోరారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే సీడబ్ల్యూసీకి సమర్పించినట్లు తెలిపారు. నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందేందుకు చర్చలు జరుపుతున్నామని కేంద్ర మంత్రికి వివరించారు.

టెలీమెట్రీ వ్యవస్థను త్వరగా ఏర్పాటు చేయాలి..!

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో చేపడుతున్న టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తొలి దశ టెలీమెట్రీ ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిందని గుర్తు చేశారు. తొలి దశ పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు రెండో, మూడో దశల టెలీమెట్రీ యంత్రాలను కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

[ Thummidihatti Barrage, CM Revanth Reddy, Revanth Reddy, CR Patil, Jal Shakti Ministry, Telangana Irrigation Projects, Maharashtra Government, PRLIS, Dindi Lift Irrigation Scheme, Sitarama Sagar Project, Samakka Sagar Project, Environmental Clearances, KRMB, Telemetry Systems, Krishna Rive ]