TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వందేళ్ల తర్వాత వెలిగిన కార్తీక మహాదీపం: భక్తుల్లో వెల్లువెత్తిన ఆనందం.!

Published on: Sun Nov 29, 2026 4:58AM

తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుప్పరంకుండ్రం కొండపై   వందేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాలు, పరిపాలనాపరమైన అడ్డంకులు, సుదీర్ఘ న్యాయపోరాటాల అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో శనివారం (నవంబర్28)  సాయంత్రం కొండపై ఉన్న పురాతన దీపస్తంభం (దీపతూన్) వద్ద కార్తీక మహాదీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించారు. శతాబ్ద కాలం తర్వాత సంప్రదాయబద్ధమైన అసలు ప్రదేశంలో జ్యోతి ప్రజ్వలన జరగడంతో కొండ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించిన భక్తులు ఆనందోత్సాహాలతో పరవశించిపోయారు.

వాస్తవానికి కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 24వ తేదీనే ఈ మహాదీపాన్ని వెలిగించాల్సి ఉంది. అయితే, స్థానిక శాంతిభద్రతల పరిస్థితులు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ అధికారులు అసలు ప్రదేశంలో కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భక్తులు, ఆధ్యాత్మిక సంఘాలు తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం కొండపై ఉన్న దీపతూన్ వద్దే కార్తీక దీపాన్ని వెలిగించాలని పట్టుబట్టాయి. ఈ వ్యవహారంపై సాగిన న్యాయపోరాటం చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కగా, విచారణ చేపట్టిన ధర్మాసనం దీపతూన్ వద్దే దీపం వెలిగించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటి అమలులో సంబంధిత యంత్రాంగం జాప్యం ప్రదర్శించడంతో సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించింది. ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి, కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ శనివారం సాయంత్రం ఖచ్చితంగా దీపతూన్ వద్ద మహాదీపాన్ని వెలిగించాల్సిందేనని విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు హెచ్చరికలతో అధికార యంత్రాంగంలో కదలిక రావడంతో పాటు, ఆలయ ట్రస్ట్ బోర్డు నిర్వహణ వ్యవహారాల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు దీపోత్సవ కార్యక్రమాన్ని సజావుగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు.

 సున్నితమైన అంశం కావడంతో కొండపైనా,  పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా   కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు   రంగంలోకి దిగి కొండపైకి వెళ్లే మార్గాల్లో భారీ బందోబస్తు నిర్వహించాయి. భద్రతా కారణాల దృష్ట్యా భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించిన అధికారులు, కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను కొండపైకి అనుమతించారు. అదే సమయంలో కొండపై ఉన్న దర్గాలో జరిగే ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఇరు వర్గాల మతపరమైన కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది.

ఇది కూడా చదవండి:  కొండ మీద దీపం: కోర్టు ముందు ప్రభుత్వం.!

తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశం దశాబ్దాలుగా స్థానికంగా వివాదాస్పదంగా మారింది. కొండపై ఆలయ సంప్రదాయాలు, సమీపంలోని దర్గా పరిసరాల నేపథ్యంలో భద్రత,  పరిపాలనాపరమైన కారణాలతో పురాతన దీపస్తూపం వద్ద దీపారాధన నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించాలని కోరుతూ భక్తులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు న్యాయస్థానాల్లో పోరాటం సాగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యం,  కోర్టు ధిక్కరణ హెచ్చరికలతో అధికారిక అడ్డంకులు తొలగిపోయి, శనివారం(నవంబర్ 28) సాయంత్రం దీపజ్యోతి వెలగడం ఈ సుదీర్ఘ వివాదంలో కీలక మలుపుగా నిలిచింది.

రాబోయే సంవత్సరాల్లో కూడా ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు, వివాదాలు లేకుండా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు ఇదే పురాతన దీపతూన్ వద్ద నిరాటంకంగా మహాదీపాన్ని వెలిగించేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. అలాగే, కొండపై శాంతియుత వాతావరణం ఎల్లప్పుడూ కొనసాగేలా భద్రతా ఏర్పాట్లను వ్యవస్థీకృతం చేయాలని, సంప్రదాయ ఆచారాలకు భంగం కలగకుండా చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వందేళ్ల తర్వాత వెలిగిన ఈ కార్తీక మహాదీపం తిరుప్పరంకుండ్రం క్షేత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

మీకు నచ్చవచ్చు:  సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్ క్షమాపణలు ఎందుకంటే.!

రేపు దీపం వెలిగించాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.!

[Thirupparankundram Karthika Deepam, Supreme Court,  Deepathoond, lamp pillar, Tamil Nadu,Karthika Maha Deepam]