TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 ఈ అలవాట్లు ఉంటే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు..! 

Published on: Mon Sep 28, 2026 2:38PM

మానవ జీవితంలో విజయం సాధించాలన్నా, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నా తెలివితేటలు ఎంత ముఖ్యమో, మన ఆలోచనలు , అలవాట్లు కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, రోజువారీ జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు లేదా ప్రతికూల ఆలోచనలు, అలవాట్ల వల్ల మనుషులు వెనకబడిపోతుంటారు. ఆలోచనా విధానంలో లోపాలు, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం , ప్రవర్తనలో వివేకం లేకపోవడం వంటివి మనిషి ఎదుగుదలకు పెద్ద అవరోధాలుగా మారతాయి. జీవితంలో ప్రశాంతతను, సాధించిన అభివృద్ధిని కాపాడుకోవాలంటే మన ప్రవర్తనను మనం నిరంతరం సమీక్షించుకోవడం చాలా అవసరం. మానసిక పరిణతి లేకపోవడం వల్ల సాధారణంగా కనిపించే కొన్ని చెడ్డ అలవాట్లు , వాటి ప్రభావం గురించి  వివరంగా తెలుసుకుంటే..

 గుడ్డిగా అందరిని  నమ్మేయడం..

సమాజంలో రకరకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఎవరి నిజస్వరూపం ఏమిటో, వారి ఉద్దేశాలు ఎలాంటివో పూర్తిగా తెలుసుకోకుండా, ఒకరిని అతిగా నమ్మడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన మానసిక వేదనను, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరినైనా నమ్మే ముందు వారి ప్రవర్తనను, నిజాయితీని గమనించడం వివేకవంతమైన లక్షణం.

డబ్బు, విజయం దక్కగానే గర్వపడటం...

ఆర్థికంగా చిన్నపాటి ఎదుగుదల కనిపించగానే విర్రవీగడం లేదా ఇతరులను తక్కువగా చూడటం వల్ల మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. నిజమైన విజేతలు ఎప్పుడూ ఒద్దికగా, వినయంతో ఉంటారు. సంపాదన పెరిగినప్పుడు సంస్కారం కూడా పెరిగితేనే ఆ ధనానికి, హోదాకు విలువ ఉంటుంది.

సొంత పనులను పక్కన పెట్టి ఇతరుల పనుల్లో  జోక్యం..

మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవడం మొదటి ప్రాధాన్యత కావాలి. మన లక్ష్యాలను, వ్యక్తిగత పనులను నిర్లక్ష్యం చేస్తూ ఇతరుల విషయాలలో అనవసరంగా సమయాన్ని వృథా చేయడం వల్ల చివరికి మనకే నష్టం జరుగుతుంది.

ప్లానింగ్ వేసి ఆచరించకపోవడం.. 

అది చేయాలి, ఇది సాధించాలి అని పెద్ద పెద్ద ప్లాన్లు వేయడం, కానీ వాటిని అమలు చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. కేవలం ఆలోచనలకే సమయాన్ని కేటాయించి, ఆచరణలో ఏమీ చేయకపోవడం వ్యక్తిగత ఎదుగుదలను పూర్తిగా అడ్డుకుంటుంది. ఏ చిన్న పనైనా ఆచరణలో పెట్టినప్పుడే దానికి ఫలితం లభిస్తుంది.

 ఆడంబరాలకు, సోకుల కోసం  డబ్బును వృథా చేయడం.. 

సమాజంలో గొప్పలు ప్రదర్శించడం కోసం, లేని ఆడంబరాల కోసం డబ్బులు  దుర్వినియోగం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పొదుపు , సరైన ఆర్థిక నిర్వహణ లేకపోవడం వల్ల మనిషి నిరంతరం ఒత్తిడికి గురవుతాడు.

పైన చెప్పుకున్న అలవాట్లు మనిషి  లో ఆలోచన లేనితనానికి అద్దం పడతాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కేవలం చదువు, తెలివితేటలు మాత్రమే సరిపోవు, మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం, సమయాన్ని ఆదా చేసుకోవడం, ఆర్థిక విషయాల గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకోవడం, మంచి ఆలోచనా విధానాన్ని అలవరచుకోవడం ఎంతగానో అవసరం. మనలో ఉన్న ఇటువంటి చిన్న చిన్న లోపాలను గుర్తించి తీర్చిదిద్దుకున్నప్పుడే జీవితంలో స్థిరమైన ప్రశాంతత, విజయం సాధ్యమవుతాయి.

                  *రూపశ్రీ.