విజయవాడ డ్రగ్స్ కేసులో సంచలనాలు! పట్టుబడిన హెరాయిన్ విలువ 21 వేల కోట్లు.. 

దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విజయవాడ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది డీఆర్‌ఐ. గతంలో ఇటువంటి కన్సైన్మెంట్‌లు వచ్చాయా అనే కోణంలో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.  సెంట్రల్ విజిలెన్స్, నార్కోటిక్ బ్యూరో, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ విలువ రూ. 21 వేల కోట్లుగా అంచనా వేశారు. సుధాకర్ దంపతులను చెన్నైలో అదుపులోకి తీసుకున్న అధికారులు గుజరాత్‌కు తరలించి.. కోర్టులో హాజరు పర్చగా సుధాకర్‌ దంపతులను పదిరోజుల డీఆర్‌ఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. మనీలాండరింగ్ కోణంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక పాత ఇంటికి తెల్లపేపర్‌పై ఏజెన్సీ పేరు ప్రింట్‌ తీసి గుమ్మానికి బోర్డులా అతికించిన ఒక ఏజెన్సీ పేరు అంతర్జాతీయ డ్రగ్‌ రాకెట్‌లో బయటపడటంపై కేంద్ర సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి. అఫ్ఘన్‌లో తయారైన హెరాయిన్‌తోపాటు ఐదు రకాల డ్రగ్స్‌ అక్రమంగా ఇరాన్‌ మీదుగా మన దేశంలోకి వస్తున్న విషయం ఇటీవలే బయట పడింది. విజయవాడ సత్యనారాయణపురంలో ఒక సాధారణ గృహిణి పేరుతో రిజిస్టరైన ఆశి ట్రేడింగ్‌ కంపెనీ రూ.వేల కోట్ల హెరాయిన్‌ దిగుమతి కోసం కన్‌సైన్‌మెంట్‌ ఇవ్వడం వెనకున్న రహస్యాన్ని కేంద్రసంస్థలు వెలికితీస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి కోసం అనుమతి తీసుకున్న ఆశి ట్రేడింగ్‌ కంపెనీ దిగుమతిలో మాత్రం టాల్కమ్‌ పౌడర్‌ పేరుతో హెరాయిన్‌ తెప్పించడంపై నిఘా సంస్థలు సీరియ్‌సగా దృష్టి పెట్టాయి. 

విజయవాడ అడ్ర్‌సతో ఉన్న ఆశి ట్రేడింగ్‌ కంపెనీ ఎటువంటి ఎగుమతులు చేయక పోయినా, అన్ని అనుమతులూ తీసుకుంది. ఏడాది తిరక్కుండానే అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. అయుతే ఈ ఏజెన్సీ నిర్వాహకులు తెలిసే నిషేధిత మత్తు పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి కన్‌సైన్‌మెంట్లు ఇచ్చినట్టు సమాచారం. ప్రతి కన్‌సైన్‌మెంట్‌కు డ్రగ్స్‌ ముఠా లక్షల రూపాయల్లో డబ్బులు ఇచ్చినట్లు కేంద్ర సంస్థలు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఈసొమ్ముతోనే సుధాకర్‌ చెన్నైలో ఇతర వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం. 

ఎన్‌ఐఏ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్‌ విజిలెన్స్‌, నార్కోటిక్‌ బ్యూరో, కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌, నేవీ ఇంటెలిజెన్స్‌ తమ తమ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ఐదు లక్షల జనాభా ఉండే కాకినాడలో ఉండే సుధాకర్‌ ఎనిమిదేళ్లుగా చెన్నైలో ఏమి చేశాడనే దానిపై ఆరా తీస్తున్నాయి. చెన్నై ఎందుకు వెళ్లాడు? పోర్టులో ఎన్నాళ్లు పని చేశాడు? అతనికి ఏ వ్యాపారాలున్నాయి? విజయవాడ యువతిని పెళ్లాడి ఆమె పుట్టింటి అడ్ర్‌సతో ఏజెన్సీ ఏర్పాటు చేయడం వెనకున్న కారణాలు ఏంటి? తదితర కోణాలు కేంద్రదర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. హెరాయిన్‌ వెనుక ఉన్న వ్యక్తులు, సిండికేట్ల గురించి దర్యాప్తు చేస్తామని, అవసరమైతే నిందితుడి ఆస్తులను అచాచ్‌ చేస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. ఎగుమతి, దిగుమతులకు లైసెన్సు పొందడానికి విజయవాడలోని ఇంటి అడ్ర్‌సను వాడుకోవడం తప్ప.. నగరంలో ఆశి ట్రేడింగ్‌ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలేవీ ఇప్పటి వరకూ వెలుగులోకి రాలేదని విజయవాడ పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు పీటీఐకి చెప్పారు. ఈ అంశంపై తమ సిబ్బంది కూలంకషంగా దర్యాప్తు చేశారని తెలిపారు.