TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భార్యాభర్తల బంధాన్ని దెబ్బతీసే అసలైన శత్రువు.. !

Published on: Wed Sep 2, 2026 9:43PM

భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది. మద్యలో జంటగా మారి.. జీవితం ముగిసే వరకు ఒకరికి ఒకరు అన్నట్టు ఉండటం ఈ బంధానికే చెల్లుతుంది. అయితే నేటి కాలంలో చాలామంది భార్యాభర్తలు అనుకునే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే... గొడవలు, కేకలు లేదా పెద్ద జగడాలు జరిగితేనే బంధం దెబ్బతింటుందని. కానీ నిజానికి ఏ గొడవలు లేకపోయినా కూడా భార్యాభర్తల మధ్య మానసిక దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే గదిలో పడుకుంటారు, కలిసి భోజనం చేస్తారు... కానీ ఇద్దరి మధ్య ఏదో తెలియని శూన్యం ఆవరించి ఉంటుంది. పైకి అంతా ప్రశాంతంగా అనిపించినా, లోపల అనుబంధం మాత్రం మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం సరియైన కమ్యూనికేషన్ లేకపోవడం లేదా మాట్లాడటం బాగా తగ్గిపోవడం. ఇది విచిత్రంగా అనిపించవచ్చు కానీ idhe నిజం.. భార్యాభర్తలు అసలు మాట్లాడుకోక పోవడం లేదా మాట్లాడటం తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది? దీని గురించి రిలేషన్షిప్ నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తిగా తెలుసుకుంటే..

దూరం చేసే మాయ..

ఒకప్పుడు ప్రతీ చిన్న విషయాన్ని ఉత్సాహంగా పంచుకున్న జంటలు, కాలక్రమేణా కేవలం అవసరమైన విషయాలకే మాట్లాడుకోవడాన్ని పరిమితం చేసుకుంటారు. పిల్లల ఫీజులు, ఇంటి సరుకులు, కరెంట్ బిల్లులు లేదా బంధువుల వివరాల గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. దీన్నే ఫంక్షనల్ కమ్యూనికేషన్ అంటారు. ఇది ఇంట్లో పనులు నడవడానికి ఎంత కావాలో అంత మాత్రమే మాట్లాడటం. కానీ దంపతుల మధ్య ఉండాల్సింది కేవలం సమాచార మార్పిడి కాదు, భావోద్వేగాల మార్పిడి. మనసులో ఏముంది, రోజంతా ఎలా గడిచింది, ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు ఏమిటి అనే విషయాలు పంచుకోనప్పుడు బంధంలో పలచదనం మొదలవుతుంది.

మాటలు తగ్గడానికి లేదా కమ్యూనికేషన్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు..

రోజువారీ బాధ్యతలు  లేదా సోషల్ మీడియా లో చిక్కుకోవడం..

ఉద్యోగం, పిల్లల పెంపకం, ఇంటి పనుల ఒత్తిడిలో పడి ఇద్దరూ తీవ్రంగా అలసిపోతున్నారు. దానికి తోడు దొరికిన కాస్త సమయాన్ని స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా లేదా టీవీలకు కేటాయిస్తున్నారు. ఒకరినొకరు చూస్తూ మనస్ఫూర్తిగా మాట్లాడుకునే సమయం లేకుండా పోతోంది.

చెప్పకుండానే అర్థం చేసుకోవాలనేమైండ్సెట్..

మేము పెళ్లై ఇన్ని సంవత్సరాలైంది, నా మనసులో ఏముందో అవతలి వారికి తెలియదా అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఎవరూ ఇతరుల మనసును చదవలేరు. ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పకపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు, అనుమానాలు పెరిగి పెద్ద గోడలా మారతాయి.

వినిపించుకునే ఓపిక లేకపోవడం..

కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడటం మాత్రమే కాదు, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం కూడా. ఒకరు చెప్తుంటే మధ్యలోనే అడ్డుపడటం, వారి భావాలను తేలికగా తీసిపారేయడం లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల అవతలివారు ఇకపై ఏ విషయమూ పంచుకోకూడదని నిర్ణయించుకుంటారు.

అసంతృప్తిని దాచుకోవడం..

మనస్పర్ధలు వస్తాయేమోననే భయంతో మనసులోని బాధను లేదా అసంతృప్తిని బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటారు. ఇది బయటకు గొడవగా కనిపించకపోయినా, లోపల ఒక రకమైన విరక్తిని, నిశ్శబ్ద దూరాన్ని పెంచుతుంది.

భార్యాభర్తల మధ్య  మానసిక దూరాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు..

ప్రతిరోజూ కనీసం 15 నుండి 20 నిమిషాల సమయాన్ని ఎలాంటి ఫోన్లు, టీవీలు లేకుండా కేవలం ఇద్దరి కోసమే కేటాయించాలి.

కేవలం కుటుంబ బాధ్యతల గురించే కాకుండా ఒకరి ఎమోషన్స్, ఆలోచనల గురించి మరొకరు అడిగి తెలుసుకోవాలి.

ఎదుటివారు మాట్లాడేటప్పుడు వారి పట్ల పూర్తి  శ్రద్ధతో ఉండాలి, చెప్పేది వినాలి.  వారి స్థానంలో నిలబడి ఆలోచించే ప్రయత్నం చేయాలి.

మనసులో ఉన్న ఇబ్బందిని స్పష్టంగా, మర్యాదపూర్వకంగా పంచుకోవాలి.

భార్యాభర్తల బంధంలో  నిశ్శబ్దం అనేది  శాంతికి సంకేతం కాదు. అది కొన్నిసార్లు  దూరం  పెరగడానికి కూడా కరణం అవుతుంది. ముఖ్యంగా ఒకరిని మరొకరు పూర్తిగా అర్థం చేసుకోలేనప్పుడు అది పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. 

కాబట్టి గొడవలు లేవు కదా అని నిర్లక్ష్యంగా ఉండకుండా, ప్రతిరోజూ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడమే సంతోషకరమైన వైవాహిక జీవితానికి అసలైన సూత్రం.

                         *రూపశ్రీ.