అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా.!
Published on: Sat Oct 10, 2026 11:05AM
అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా.!

ఏదైనా ఒక అందమైన బంధానికి అతి ముఖ్యమైన పునాది ప్రేమ , పరస్పర నమ్మకం. ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను పంచుకునేటప్పుడు ఆ బంధంలో నమ్మకమే ప్రధాన ఊపిరిగా పనిచేస్తుంది. అయితే అదే నమ్మకం స్థానంలో చిన్నగా అనుమానం ప్రవేశిస్తే ఎంతటి బలమైన బంధమైనా క్రమంగా విచ్ఛిన్నం కావడానికి ఎంతో సమయం పట్టదు. భాగస్వామి ప్రతి చిన్న కదలికను తప్పుగా అర్థం చేసుకోవడం, ప్రతి విషయానికి భయపడటం , మనస్సులోనే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండటం బంధంలో మానసిక దూరాన్ని పెంచుతాయి. అనుమానించే అలవాటు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో, ఆ లక్షణాలు ఎలా ఉంటాయో , దానిని ఎలా అధిగమించవచ్చో వివరంగా తెలుసుకుంటే..
ప్రతి చిన్న విషయానికీ ప్రశ్నించడం..
భాగస్వామి ఎక్కడికి వెళ్లారు, ఎవరితో ఉన్నారు, ఎందుకు ఆలస్యమైంది అని సాధారణంగా అడిగే ప్రశ్నలు, ఇవి ప్రేమకు సంకేతం కావచ్చు. కానీ అదే పనిగా ప్రతి నిమిషం వివరాలు అడుగుతూ, వారి సమాధానాలను తప్పు పడుతుంటే అది భద్రతాభావం లోపించడానికే సూచిక. భాగస్వామిని నిరంతరం ప్రశ్నించడం వల్ల వారికి తమ స్వతంత్రతను కోల్పోతున్నామనే భావన కలుగుతుంది. ఇది వారిలో తీవ్రమైన ఒత్తిడిని, అసహనాన్ని నింపుతుంది.
ప్రైవసీకి భంగం కలిగించడం..
ఒకరి ఫోన్‌ను దొంగతనంగా చూడటం, మెసేజ్‌లు , కాల్ హిస్టరీ చెక్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్స్ పై నిరంతరం నిఘా పెట్టడం వంటి పనులు బంధంలో వ్యక్తిగత లిమిట్స్ ను దాటడమే అవుతాయి. నమ్మకాన్ని పెంచడానికి ఇలాంటి పనులు ఎంతమాత్రం ఉపయోగపడవు. పైగా ఇవి భాగస్వామికి తమపై అసలు గౌరవం లేదనే భావనను కలిగిస్తాయి.
ఆధారాలు లేకుండా నిందలు వేయడం..
భాగస్వామి ఏదైనా పనిలో బిజీగా ఉండి ఫోన్ తీయనప్పుడు లేదా మెసేజ్‌కు ఆలస్యంగా రిప్లై ఇచ్చినప్పుడు, పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేరుగా ఏదో తప్పు జరుగుతోందని నిర్ణయానికి రావడం చాలా ప్రమాదకరం. ఆధారాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా నిందలు వేయడం వల్ల భాగస్వామి తీవ్ర మనస్తాపానికి గురవుతారు. విషయాలను సూటిగా అడిగి తెలుసుకోవడానికి బదులు ఊహించుకోవడం వల్ల లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.
బంధంలో మానసిక దూరం పెరగడం..
నిరంతరం అనుమానాలు, నిందలు ఎదుర్కొనే భాగస్వామి మానసికంగా అలసిపోతారు. తమను ప్రతి విషయంలోనూ తప్పుగా భావిస్తున్నారని అనిపించినప్పుడు వారు క్రమంగా మాట్లాడటం తగ్గించేస్తారు. మరోవైపు అనుమానించే వ్యక్తి కూడా నిరంతరం ఆందోళన, భయంతో గడుపుతారు. దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ, ఆత్మీయత తగ్గిపోయి మానసిక దూరం చాలా వేగంగా పెరుగుతుంది.
అనుమానానికి అసలు కారణాలు..
అనుమానించే అలవాటు ఎప్పుడూ భాగస్వామి చేసే తప్పుల వల్లే రావాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న చేదు అనుభవాలు, చిన్నతనంలో ఎదురైన మానసిక సంఘటనలు, ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా భాగస్వామిని ఎక్కడ కోల్పోతామోననే భయం కూడా వ్యక్తిని ఎక్కువగా అనుమానించేలా చేస్తాయి. ముందుగా ఈ భయాలకు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం.
బంధాన్ని కాపాడుకోవడానికి మార్గాలు..
ముందుగా మనస్సులో కలిగే అనుమానాలు నిజమైన సంఘటనల ఆధారంగా వస్తున్నాయా లేదా కేవలం భయాల వల్ల వస్తున్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. భాగస్వామిపై నిందలు వేసే విధంగా కాకుండా మీ భయాలు, ఆందోళనల గురించి వారితో ప్రశాంతంగా, ఓపేన్ గా మాట్లాడాలి. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించడం నేర్చుకోవాలి. అనుమానాలు మరీ ఎక్కువై బంధం చేజారిపోతోందని అనిపిస్తే దంపతులు మంచి కౌన్సెలర్ లేదా మానసిక నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో మంచిది.
*రూపశ్రీ.


