పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెండ్ చేసిన టీజీ సేఫ్: హైదరాబాద్ స్వీట్ షాపులపై తనిఖీలు.!
Published on: Thu Oct 29, 2026 12:12PM

హైదరాబాద్ లోని ప్రముఖ స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్ర వాతావరణంలో మిఠాయిలను తయారు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ తనిఖీల్లో దశాబ్దాలుగా నాణ్యతకు, రుచికీ బ్రాండ్ అన్న గుర్తింపు పొందిన జి. పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్‌ను టీజీ సేఫ్ అధికారులు సస్పెండ్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16 ప్రధాన స్వీట్ షాపులపై టీజీ సేఫ్ ఏకకాలంలో దాడులు చేసింది. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన, కల్తీ, పాడైపోయిన సుమారు 3 వేల 546 కిలోల ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. వీటి మార్కెట్ విలువ 16 లక్షల 86 వేల రూపాయలుగా అంచనా. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని 5 ప్రముఖ సంస్థల లైసెన్సులను రద్దు చేశారు. అలా లైసెన్సులను సస్పెండ్ చేసిన వాటిలో పుల్లారెడ్డి స్వీట్స్ కూడా ఉంది.
సనత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్ తయారీ కేంద్రంలో అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. వంటగదిలో కుళ్లిన కూరగాయలు, ఎలుకల వ్యర్థాలు ఉండటంతో పాటు గడువు ముగిసిన పదార్థాలను స్వీట్ల తయారీకి వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తయారీ కేంద్రం నుంచి 15 లక్షల 3వేల రూపాయల విలువైన 3 వేల 133 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసి, పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ రద్దు చేశారు.

ఇంకా చార్మినార్‌లోని ఆగ్రా మిఠాయి ఘర్, వనస్థలిపురంలోని స్వీట్ వన్ రుచులు, ఫలక్‌నుమాలోని బాలాజీ శ్రీ కిషన్ మిఠాయి భండార్, కాటేదాన్‌లోని హిరాణి ఫుడ్స్ వంటి సంస్థల లైసెన్స్ లను కూడా టీసీ సేఫ్ అధికారులు సస్పెండ్ చేశారు. ఇవే కాకుండా, ఎలాంటి లైసెన్సులు లేకుండా, అపరిశుభ్రత మధ్య నిర్వహిస్తున్న చాంపపేట్‌లోని బాలాజీ స్వీట్స్, సికింద్రాబాద్‌లోని మమతా స్వీట్ హౌస్ సహా మరో మూడు దుకాణాలను టీజీ సేఫ్ అధికారులు మూయించేశారు. ఈ తనిఖీల సందర్భంగా వివిధ కేంద్రాల నుంచి మొత్తం 22 ఆహార పదార్థాల నమూనాలను సేకరించిన అధికారులు, వాటిని నాణ్యత పరీక్షల కోసం పంపించారు.
[TG Safe Suspend Lisence Of Pulla Reddy Sweets, Hyderabad Food Safety Raids, Hyderabad, Adulterated Sweets, TG Food Safety Inspections, Telangana, Telugu One]


