TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూకట్‌పల్లిలో 20 ఆహార సంస్థల్లో తనిఖీలు.. ఐదు సంస్థల లైసెన్సులు సస్పెండ్‌..!

Published on: Wed Sep 9, 2026 9:17PM

కూకట్‌పల్లి ప్రాంతంలోని రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌ షాపులు, మెస్సులు, పీజీ హాస్టళ్లలో తెలంగాణ ఆహార  నిత్యావసర ఔషధాల ప్రమాణాల ప్రాధికార సంస్థ (టీజీ సేఫ్) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఆహార భద్రతా అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన 10 బృందాలు మొత్తం 20 సంస్థలను తనిఖీ చేయగా.. పలు చోట్ల అపరిశుభ్రత, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద వంటి ఉల్లంఘనలు గుర్తించారు.తనిఖీల్లో కల్తీ జరిగినట్లు అనుమానించిన 20 ఆహార నమూనాలను సేకరించారు. 

పాడైపోయిన కూరగాయలు, పురుగులు పట్టిన వేరుశెనగలు, పిండి పదార్థాలు, ఎర్ర మిరపకాయలు తదితర ముడి పదార్థాలను అక్కడికక్కడే పారవేశారు. శాకాహార, మాంసాహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయకపోవడం, రిఫ్రిజిరేటర్లను అపరిశుభ్రంగా నిర్వహించడం, సరైన లేబులింగ్ లేకపోవడం, ఆహారాన్ని నిర్వహించే సిబ్బంది పరిశుభ్రత పాటించకపోవడం వంటి లోపాలు కూడా గుర్తించారు.

FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న GVK న్యూ లగ్జరీ PG మెన్స్ హాస్టల్‌ను అధికారులు మూసివేశారు. గుమ్మడి ఫుడ్స్‌లోని శ్రీ మహాలక్ష్మి కేంద్రం, KS బేకర్స్, లక్ష్మీ వెంకమాంబ హాస్టల్, పద్మావతి డీలక్స్ మెస్, మెహఫిల్ రెస్టారెంట్, శ్రీ హర్ష డీలక్స్ మెస్‌లకు మెరుగుదల నోటీసులు జారీ చేయనున్నారు. ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్, చైతన్య ఫుడ్ కోర్ట్, భూలక్ష్మి మెస్, గోదావరి మిఠాయిలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి జరిమానాల విధింపునకు చర్యలు చేపట్టనున్నారు.

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా మణికంఠ లైవ్ స్పేస్ లగ్జరీ ఉమెన్స్ హాస్టల్, శ్రీ బాలాజీ లగ్జరీ మెన్స్ PG హాస్టల్, హోటల్ సితారా గ్రాండ్, బేక్ మ్యాక్స్ ఫుడ్స్‌కు చెందిన బ్రౌన్ బేర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో బొద్దింకలు, ఈగల బెడద, గడువు ముగిసిన ఆహారం, పాడైపోయిన కూరగాయలు, అపరిశుభ్రమైన కోల్డ్ స్టోరేజ్‌ను గుర్తించారు. మండి కింగ్ అరేబియన్ రెస్టారెంట్‌లో రిఫ్రిజిరేటర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పాటు శాకాహార, మాంసాహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయకపోవడం, పచ్చి, పాక్షికంగా తయారైన ఆహార పదార్థాలను సక్రమంగా నిర్వహించకపోవడం, పాడైపోయిన కూరగాయలు, అపరిశుభ్రమైన ప్రాంగణం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే సంస్థలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని టీజీ సేఫ్ అధికారులు స్పష్టం చేశారు.

 

 

(TG Safe, FSSAI, Telangana food,  Telangana goverment, CM Revanth reddy, Minister Jupally Krishna Rao, Telugu News, Telugu One)