TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా.. టెక్సాస్‌లో హనుమంతుడి విగ్రహం.!

Published on: Tue Sep 22, 2026 10:03AM

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన భారీ హనుమంతుడి విగ్రహం రాజకీయ చర్చకు, రచ్చకు కేంద్ర బిందువుగా మారింది.  హిందూ సమాజ భ ఐక్యత, సేవాభావానికి ప్రతీకగా ఉన్న ఈ విగ్రహంపై కొందరు    అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇండియన్  అమెరికన్లు తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించే హక్కును సమర్థిస్తూ స్పందిస్తున్నారు. ఈ పరిణామాలు అమెరికాలో మత స్వేచ్ఛ, వలసలు, సాంస్కృతిక వైవిధ్యం, రాజకీయ ధోరణులపై మరోసారి చర్చకు తెరలేపాయి.  

 టెక్సాస్ రాష్ట్రం షుగర్‌ల్యాండ్‌లోని అష్టలక్ష్మీ దేవాలయం ప్రాంగణంలో 90 అడుగుల ఎత్తైన భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గా పిలిచే  ఈ విగ్రహం  ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి సంకల్పంతో ఏర్పాటైంది. 2024 ఆగస్టు 18న ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల మధ్య విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అమెరికాలోని హిందూ సమాజానికి ఇదో  ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది.  హనుమంతుడి విగ్రహం ఏర్పాటైనప్పటి నుంచీ హిందూయేతర వర్ాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతునే ఉన్నాయి. 

2025లో టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్ నాయకుడు అలెగ్జాండర్ డంకన్ ఈ విగ్రహంపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి   ఆజ్యం పోశాయి. హిందూ దేవుడి విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని హిందూ వ్యతిరేక విద్వేష వ్యాఖ్యలుగా అభివర్ణిస్తూ రిపబ్లికన్ పార్టీ దృష్టికి తీసుళ్లింది.  ఈ పరిణామం మత విశ్వాసాలు, ఇతర మతాల పట్ల గౌరవం, అమెరికా రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చకు తెరలేపాయి. 


తాజాగా హనుమంతుడి విగ్రహంపై సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్న వ్యాఖ్యలు మరోసారి వివాదాన్నిలైమ్ లైట్ లోకి తీసుకువచ్చాయి.  యూట్యూబర్ జెస్సీ హ్యూస్, టెక్సాస్‌లోని 90 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని కూల్చివేస్తామనే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో చేసిన పోస్టు కలకలం రేపింది.  ఆ యూట్యూబర్ వ్యాఖ్యలపై హిందూ అమెరికన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మతానికి చెందిన ఆరాధనా స్థలాన్ని, దేవతా విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకోవడం మత స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

హనుమంతుడి విగ్రహంపై వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా సైన్యంలో పనిచేసిన రుచిర్ బక్షి స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్‌లలో విధులు నిర్వహించిన హిందూ అమెరికన్ సైనికుడైన ఆయన..  తన మతాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.దేశం కోసం యుద్ధ ప్రాంతాల్లో సేవలందించిన తనలాంటి వ్యక్తులు తమ మత విశ్వాసాల కారణంగా అవమానాలను ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు.  టెక్సాస్ లో హనుమంతుడి విగ్రహం చుట్టూ సాగుతున్న వివాదం కేవలం ఒక మతపరమైన అంశంగా కాకుండా, అమెరికాలో నివసిస్తున్న మైనారిటీ వర్గాల హక్కులు, మత స్వేచ్ఛ, సామాజిక సమానత్వం వంటి అంశాలను కూడా తెరపైకి తెచ్చింది. 

అమెరికాలోని హిందూ సంస్థలు, ఇండియన్ అమెరికన్లు  ఈ తరహా వ్యాఖ్యలను మతపరమైన అసహనానికి సంకేతాలుగా అభివర్ణిస్తున్నారు. హిందూ దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అయితే, అమెరికా సమాజంలో భిన్న మతాలు, సంస్కృతులు కలిసిమెలిసి జీవిస్తున్న నేపథ్యంలో పరస్పర గౌరవం, చర్చ, చట్టబద్ధమైన పరిష్కారాల అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.  

[Texas Hanuman Statue, Hanuman Statue America, Statue Of Union, Hinduism  America, Indian Americans, Texas Politics, Religious Freedom]