పులివెందులలో ఉద్రిక్తత: పార్నపల్లె వద్ద అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.!
Published on: Thu Nov 5, 2026 8:38AM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పులివెందుల నియోజకవర్గం పరిధిలోని ఆర్.తుమ్మలపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. ఈ వివాదం ముదిరిన క్రమంలో జరిగిన రాళ్లు, సీసాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. మరోవైపు, ఎర్రిపల్లి ప్రాంతంలో ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారంటూ వైసీపీ ఆందోళనకు దిగడంతో అక్కడా ఉద్రిక్తత నెలకొంది. అలాగే లింగాల మండలం పార్నపల్లెలోనూ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
.webp)
అక్కడ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల వ్యవహారంపై వివాదం తలెత్తింది. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను బూత్‌లోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ వైసీపీ పెద్దఎత్తున ఆందోళనకు దిగింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ పార్నపల్లెకు బయలుదేరిన కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నాయకుడు వైయస్ అవినాష్ రెడ్డిని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది.
అలాగే పెద్దముడియం మండలం గుండ్లకుంట పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పోలింగ్ కేంద్రం ప్రాంగణంలోనే వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి టీడీపీ ఏజెంట్లను బయటకు తోసేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల నాయకులు ఒకరినొకరు తోసుకుంటూ నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని గుంపును చెదరగొట్టారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ అప్రమత్తమైంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించే వారిపై, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
[Tenssion in Pulivendula, MPTC ZPTC Elections AP, TDP YCP Clash Pulivendula, Kadapa District, AP Politics, Telugu One]


