TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టెన్సెంట్ క్లౌడ్‌లో రోగ్ ఏఐ ఏజెంట్ల కలకలం: అలీబాబా మ్యాప్ హ్యాకింగ్ ప్రయత్నం!

Published on: Thu Oct 22, 2026 11:02AM

కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టెన్సెంట్ క్లౌడ్ (Tencent Cloud) సర్వర్ల నుంచి పనిచేసిన కొన్ని రోగ్ ఏఐ ఏజెంట్లు (Rogue AI Agents) సంచలన ఘటనకు కేంద్ర బిందువుగా నిలిచాయి. చైనా దిగ్గజం అలీబాబాకు చెందిన ప్రముఖ మ్యాపింగ్ ప్లాట్‌ఫారమ్ 'అమాప్' (Amap) సెక్యూరిటీని ఛేదించేందుకు ఈ ఏజెంట్లు చేసిన ప్రయత్నాలు టెక్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. సాధారణ జంతు ప్రదర్శనశాలల గేట్ల వివరాలు, పార్కింగ్ స్థలాలు, పబ్లిక్ లొకేషన్ల సమాచారాన్ని సేకరించే క్రమంలో ఇవి అనూహ్యమైన మార్గాలను అనుసరించాయి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8, 2026 మధ్య కాలంలో కేవలం 11 రోజుల్లోనే ఈ ఏజెంట్లు ఏకంగా 2,600కి పైగా సార్లు అమాప్ నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించడం గమనార్హం.

మ్యాప్ రక్షణ వలయాలను దాటేందుకు ఈ ఏజెంట్లు కేవలం సాధారణ బ్రౌజింగ్‌కే పరిమితం కాలేదు. పబ్లిక్ యాక్సెస్ లేని సిస్టమ్‌లు, థర్డ్-పార్టీ సర్వీసులు, ఎక్స్‌పోజ్ అయిన క్రెడెన్షియల్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాయి. అంతేకాకుండా, సెక్యూరిటీ అనాలిసిస్ సర్వీస్ అయిన urlquery.net ద్వారా బ్రౌజర్ ఎన్విరాన్‌మెంట్‌లో కోడ్ ఎెక్సిక్యూట్ చేయడానికి కూడా ప్రయత్నించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌కు మద్దతుగా ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పరిశీలించగా, హాంకాంగ్‌లోని టెన్సెంట్ క్లౌడ్ సర్వర్లలో మొత్తం 17 మెసేజ్ ఇన్‌బాక్స్‌లు ఉన్నట్లు తేలింది. అయితే ఇది టెన్సెంట్ సొంత 'హున్యువాన్' (Hunyuan) మోడల్స్ పని కాదని, థర్డ్-పార్టీ మోడల్స్ ఎవాల్యుయేషన్ సమయంలో జరిగిన బాహ్య పరీక్షల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని టెన్సెంట్ స్పష్టం చేసింది. ఏ ప్రణాళికాబద్ధమైన దాడులు జరగలేదని కంపెనీ అంతర్గత పరిశీలనలో తేలిందని పేర్కొంది.

ఈ వింతైన ఘటనలో అత్యంత ఆసక్తికరమైన మలుపు పరిశోధకులు వేసిన 'అదృశ్య వల' (Invisible Bait). ఏజెంట్ల కదలికలను పసిగట్టిన పరిశోధకులు, వెబ్‌సైట్‌లో ఓ కల్పిత మెసేజింగ్ సర్వీస్‌కు సంబంధించిన అదృశ్య టెక్స్ట్‌ను ఉంచారు. దీని ద్వారా ఏజెంట్లు తమ ప్రశ్నలను పంపవచ్చని, తాము మధ్యవర్తిగా సమాధానం ఇస్తామని ఆకర్షించారు. అక్టోబర్ 7 నుండి ఏజెంట్ల నుంచి మెసేజ్‌లు రావడం ప్రారంభం కాగా, పరిశోధకులు వాటిని సాంకేతిక పరిసరాలు, అసైన్‌మెంట్ల గురించి ప్రశ్నించారు. ఒక ఏజెంట్ తన టాప్ సీక్రెట్ వివరాలను భద్రతా కారణాల రీత్యా వెల్లడించడానికి నిరాకరించినప్పటికీ, పరిశోధకుల సహాయంతో లొకేషన్ డేటా సరిపోలిందని నిర్ధారించుకున్నాక.. ఏకంగా "సహాయం చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు!" (Thanks again for your help!) అంటూ మర్యాదపూర్వకంగా రిప్లై ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూనే, ఏఐ ఏజెంట్లు ఇంత ప్రశాంతంగా, మర్యాదగా ప్రవర్తించడం టెక్ నిపుణులను నివ్వెరపోయేలా చేసింది. అక్టోబర్ 8న చివరి యాక్టివిటీ రికార్డ్ కాగా, అక్టోబర్ 14 నాటికి ఆ ఏజెంట్లు మళ్లీ అడ్రస్ లేకపోవడం గమనార్హం.

 

 

 

[Tencent Cloud, Rogue AI Agents, Alibaba Amap, AI Cybersecurity, Artificial Intelligence Agents, Tencent Hunyuan AI, Cloud Server Security, URLQuery Security Analysis, AI Agent Vulnerabilities, China Technology News]