TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏ పార్టీకీ కొమ్ము కాయని ఈనాడు.. వార్తా ప్రచురణలో నిష్పాక్షికతకే పెద్ద పీట.!

Published on: Mon Oct 26, 2026 2:54PM

తెలుగు వన్  డిజిటల్ మీడియా వేదికగా ప్రసారమవుతున్న ది జర్నలిస్ట్ రెండో ఎపిసోడ్ లో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లో   ఈనాడు సంస్థ ప్రస్థానం, ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దివంగత రామోజీరావు పనితీరు, రాష్ట్ర  రాజకీయ పరిణామాలకు సంబంధించి ఆసక్తికర విషయాలనుచర్చించారు. గత ఎపిసోడ్ కొనసాగింపుగా ఈ చర్చలో పత్రికా విలువలు, రాజకీయ పార్టీలతో సంబంధాలు వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి.

ఈ సంభాషణలో ప్రధానంగా ఈనాడు పత్రికకు, తెలుగుదేశం పార్టీకి మధ్య  ప్రత్యేక బంధం ఉందా అనే అంశంపై డీఎన్ ప్రసాద్ వివరణాత్మక విశ్లేషణ చేశారు. తెలుగుదేశం, ఈనాడు సంబంధాలపై తరచూ వినిపించే కథనాలు, విమర్శలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందే.. అంటే  1979 నాటికే సర్క్యులేషన్ ఆడిట్ ప్రకారం ఈనాడు అగ్రగామి పత్రికగా ఎదిగిందని గుర్తు చేశారు.  రామోజీరావు ఎప్పుడూ ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయాలని పత్రికను నడపలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  పత్రికా విలువల పట్ల రామోజీరావుకు స్పష్టత, అవగాహన ఉన్నాయనీ,  వార్తల ప్రచురణలో  నిష్పాక్షికతకే ఆయన పెద్ద పీట వేశారనీ చెప్పారు. 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తొలి నాళ్లలో ఈనాడు అనుసరించిన వైఖరిని ప్రసాద్ కూలంకషంగా వివరించారు. తెలుగుదేశం పార్టీకి తొలినాళ్లలో ఎదురైన సవాళ్లు, చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసిన విదానాలను వివరించారు.  కార్యకర్తలను నేరుగా కలుస్తూ, రాత్రింబవళ్లు శ్రమించే నాయకత్వ శైలి కారణంగానే తెలుగుదేశం పార్టీ బలోపేతమైందని, అయితే ఈనాడు ఎన్నడూ తన  స్వతంత్ర విధానాల నుంచి పక్కకు జరగలేదని స్పష్టం చేశారు. 

రామోజీరావు  ఎన్నడూ  ఎడిటోరియల్ విభాగం జోలికి వెళ్లేవారు కాదని సహచర సీనియర్లను ఉటంకిస్తూ డీఎన్ ప్రసాద్ గుర్తుచేశారు. వార్తలు ఎలా రాయాలో ఆయన నిర్దేశించేవారు కాదన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే ప్రజల పక్షాన నిలబడటమే పత్రిక   లక్ష్యమని రామోజీరావు నమ్మేవారనీ, ఆచరణలోనూ దానికే కట్టుబడ్డారని చెప్పారు.  

ది జర్నలిస్ట్ కార్యక్రమంలో ప్రస్తుత డిజిటల్ యుగంలో జర్నలిజం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రింట్ మీడియా భవిష్యత్తు గురించి కూడా రవిశంకర్, డీఎన్ ప్రసాద్ చర్చించారు. సమాజంలో మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా జర్నలిజం ప్రయాణిస్తున్న తీరుపై వీరి చర్చ విశ్లేషణాత్మకంగా సాగింది. సమాజంపై పత్రికలు చూపే ప్రభావం,  పాఠకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో జర్నలిస్టులు పాటించాల్సిన నైతిక విలువలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

రాబోయే రోజుల్లో వార్తా సంస్థల నిర్వహణలో వచ్చే  సాంకేతిక మార్పులు, సోషల్ మీడియా ప్రభావంపై కూడా  డీఎన్ ప్రసాద్, రవిశంకర్ తమతమ అభిప్రాయాలను పంచుకున్నారు. పాఠకులు కోరుకునే నిజమైన వార్తలను అందించడంలో డిజిటల్ మీడియా పాత్ర పెరుగుతున్నప్పటికీ, విశ్వసనీయత అనేదే ప్రాతిపదికగా నిలబడుతుందని ముక్తాయించారు.   నిజాయితీతో కూడిన జర్నలిజం మాత్రమే   ప్రజల ఆదరణ పొందుతుందని ఏకాభిప్రాయం వీరి చర్చలో వ్యక్తమైంది. 

[Telugu One The Journalist interview, D.N. Prasad, Ramoji Rao, Eenadu, Kanthamneni  Ravi Shankar, Values, Journalism, Eenadu Standards]