తెలంగాణలో టెంపుల్ కారిడార్: గోదారి తీరం వెంబడి పుణ్యక్షేత్రాల అనుసంధానం.!
Published on: Fri Nov 27, 2026 2:31PM

తెలంగాణలో టెంపుల్ కారిడార్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. బాసర నుంచి భద్రాచలం వరకూ గోదారి తీరం వెంబడి ఉన్న పుణ్య క్షేత్రాలను అనుసంధానిస్తూ ఈ టెంపుల్ కారిడార్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించి, సమీక్షించారు. ఆలయ ప్రాంగణం, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించి పనుల పురోగతిపై ఆరా తీశారు.
పొంగులేటి.. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలతో పాటు ముక్కోటి ఏకాదశి వంటి ముఖ్య ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం వద్ద నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ పక్షం రోజులకు ఒకసారి పనుల పురోగతిని సమీక్షిస్తోందని మంత్రి వెల్లడించారు.
ఇక భద్రాచలం ఆలయ అభివృద్ధి, గోదావరి ఘాట్‌లు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నిధులు, దశలవారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా ఆలయ పరిసరాల అభివృద్ధితో పాటు పట్టణ మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి పెట్టారు. గోదావరి నది తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రాలను ఒక మార్గంగా అనుసంధానించడం ద్వారా యాత్రికుల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

గోదావరి తీరం వెంబడి ఉన్న దేవాలయాలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రజలలో విస్తృతంగా ప్రజారం చేయడం ద్వారా విశేష ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే బాసర నుంచి భద్రాచలం వరకు కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగం, అనుబంధ రంగాల కార్యకలాపాలు జోరందుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: బాసరకు పోటెత్తిన భక్తులు: జ్ణానసరస్వతి జన్మనక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసాలు.!
క్షేత్రస్థాయి పనుల పర్యవేక్షణ, సమీక్షా సమావేశాల ద్వారా పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, యంత్రాంగం కలిసి పనిచేయడం వల్ల భూసేకరణ, నిర్మాణ అనుమతులు వంటి అంశాల్లో వేగం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

రాబోయే రోజుల్లో టెంపుల్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలు, పనుల దశలవారీ పురోగతిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముక్కోటి ఏకాదశి, గోదావరి పుష్కరాల నాటికి నిర్దేశించిన పనులు ఏ మేరకు పూర్తవుతాయనే దానిపై అందరి దృష్టి నిలిచింది.
మీకు నచ్చవచ్చు: భద్రాచలం పేరు అలా వచ్చింది
[Telangana Temple Corridor, Basara, Bhadrachalam, Ponguleti Srinivasa Reddy, Developement, TeleguOne]


