తెలంగాణ సచివాలయంలో హై టెన్షన్: ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న బాధితులు.!
Published on: Mon Sep 28, 2026 5:11PM

తెలంగాణ సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివిధ విభాగాలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, అలాగే పలు అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సచివాలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. తమకు రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు.ప్రధానంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ వెలుపల ఈ ఆందోళన కార్యక్రమం జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమకు చెల్లించాల్సిన బిల్లులు నిలిచిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళనకారులు వాపోయారు. పలుమార్లు అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదని, అందుకే నేరుగా సచివాలయానికి వచ్చి నిరసన తెలపాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు.
ఈ నిరసన కారణంగా సచివాలయంలోని ఒక్కసారిగా హైడ్రామా వాతావరణం నెలకొంది. భద్రతా సిబ్బంది పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద భారీగా మోహరించిన భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ బకాయిలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బాధితులు కోరారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తాము దినదినం నరకం అనుభవిస్తున్నామని, ప్రభుత్వ పెద్దలు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు తేల్చిచెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ, గత పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఆలస్యం కావడంపై వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో అధికార వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. బకాయిల క్లియరెన్స్‌పై ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ఘటనతో సచివాలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అధికారులు సమస్య పరిష్కారం కోసం ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు.
[ Telangana Secretariat protest, Deputy CM Bhatti Vikramarka, retired employees protest,contractors protest, Telangana news, TeluguOne news ]


