TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆరు అంశాల్లో: జాతీయస్థాయిలో తెలంగాణ అగ్రస్థానం.!

Published on: Fri Sep 25, 2026 8:39PM

మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతూ ఈగల్ ఫోర్స్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన జాతీయస్థాయి యాంటీ నార్కోటిక్స్ అధిపతుల సమావేశంలో వెల్లడైన వివరాల ప్రకారం.. 10 కీలక అంశాల్లో తెలంగాణ పోలీసులు ఆరు విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచారని చెప్పారు.శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు అధికారులు, సిబ్బందితో సి.వి. ఆనంద్ సమావేశమయ్యారు. డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న దర్యాప్తులు, అరెస్టులు, ఆస్తుల స్వాధీనం, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లపై చర్యలను సమీక్షించారు.డ్రగ్స్ కేసుల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న విధానం జాతీయస్థాయిలో ప్రత్యేకంగా నిలుస్తోందని అధికారులు తెలిపారు. 

దేశవ్యాప్తంగా ఒక్కో డ్రగ్స్ కేసులో సగటున 1.3 మంది అరెస్టు అవుతుండగా.. తెలంగాణలో ఒక్కో కేసుకు సగటున 3.7 మంది అరెస్టు అవుతున్నట్లు వివరించారు. కేవలం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో దర్యాప్తును ముగించకుండా.. సరఫరా వ్యవస్థ, నెట్‌వర్క్‌లోని ఇతర వ్యక్తుల వరకు దర్యాప్తును విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల ద్వారా సంపాదించిన ఆస్తులపైనా తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 68ఎఫ్ కింద డ్రగ్స్ అక్రమ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుం టున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మాదకద్రవ్యాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న యువత, మైనర్లను గుర్తించి రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను పూర్తిస్థాయిలో ఛేదించేందుకు ఈగల్ ఫోర్స్ రాష్ట్ర సరిహద్దులకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తోంది. థాయిలాండ్, గోవా, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లి డ్రగ్స్ సరఫరా, రవాణాకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.

 అంతర్జా తీయ స్థాయిలో విస్తరించిన డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.ఆన్‌లైన్‌లో రహస్యంగా సాగుతున్న డ్రగ్స్ వ్యాపారంపైనా ఈగల్ ఫోర్స్ నిఘా పెంచింది. డార్క్‌వెబ్ కార్యకలాపాలను విశ్లేషిస్తూ మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌లను గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డార్క్‌వెబ్ ఆధారంగా నిర్వహించిన దర్యాప్తుల్లో 500 కిలోలకు పైగా డ్రగ్స్‌కు సంబంధించిన 15కు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన పలు కీలక అంశాల్లో తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో మెరుగైన పనితీరు కనబరిచారని డీజీపీ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ వ్యవస్థ, కేసుల్లో అరెస్టులు, ఆస్తుల స్వాధీనం, అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు, డార్క్‌వెబ్ విశ్లేషణ, భారీ మొత్తంలో మాదకద్రవ్యాల స్వాధీనం వంటి ఆరు అంశాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.డ్రగ్స్ నియంత్రణలో సాధించిన ఫలితాలతో ఆగిపోకుండా.. మిగిలిన అంశాల్లోనూ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని డీజీపీ అధికారులకు సూచించారు. యువతను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు పోలీసులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.‘‘యువత భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత. నషాముక్తి తెలంగాణ, నషాముక్తి భారత్ లక్ష్యాలను సాధించేందుకు సమష్టి కృషి అవసరం. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపేలా మరింత సమర్థవంతంగా పనిచేద్దాం’’ అని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.

 

 

 

[ Telangana Police, DGP CV Anand, Eagle Force, Drug Control, Anti Narcotics, Telangana Drugs, Drug Seizure, Drug Network, Dark Web Drugs, NDPS Act, Drug Cases, Drug Trafficking, International Drug Network, Drug Enforcement ]