తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్..!
Published on: Tue Sep 15, 2026 12:28PM

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ (హైదరాబాద్ ముక్తి దివస్) ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కేంద్ర సాయుధ బలగాల కవాతు (పరేడ్) రిహార్సల్స్, సాంస్కృతిక ప్రదర్శనల సన్నాహాలను కిషన్ రెడ్డి వీక్షించారు. అనంతరం భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, వీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
.webp)
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్య్ర పండుగ చేసుకుంటుంటే, ఆనాడు నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో మాత్రం స్వాతంత్య్రం రాలేదని తెలిపారు. గ్రామగ్రామాన రజాకార్లు హిందువులపై దాడులు, దమనకాండ కొనసాగిస్తూ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ దమనకాండ నుంచి తమను, తమ గ్రామాలను కాపాడుకోవడం కోసం ప్రజలే స్వయంగా బురుజులు, రక్షణ గోడలు నిర్మించుకుని నిలబడ్డారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆనాటి రక్త చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, గుర్తులు నేటికీ తెలంగాణ పల్లెల్లో సజీవంగా కనిపిస్తున్నాయని అన్నారు.
ఇది ఏ ఒక్కరికో సంబంధించిన కార్యక్రమం కాదని, ఆనాడు నిజాం పెట్టిన బాధలను భరించి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులను స్మరించుకోవడం కోసమే భారత ప్రభుత్వం అధికారికంగా ‘హైదరాబాద్ ముక్తి దివస్’ను ప్రారంభించిందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గానీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గానీ మజ్లిస్ పార్టీకి భయపడి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను సైతం పక్కనపెట్టి, ఈ చారిత్రక దినోత్సవాన్ని నిర్వహించకుండా తప్పించుకున్నాయని కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముందుకు రాకపోవడంతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత ప్రభుత్వమే స్వయంగా బాధ్యత తీసుకుని ఈ ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తోందని చెప్పారు.
.webp)
ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా కేంద్ర సాయుధ దళాల విన్యాసాలతో పాటు, ప్రత్యేకంగా వేలాది మంది తెలంగాణ కళాకారులతో కూడిన ఆకర్షణీయమైన నాట్య ప్రదర్శనలు, సంప్రదాయ డప్పుల విన్యాసాలు ఉంటాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చారిత్రక పోరాటాలను కళ్లకు కట్టేలా ఈ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.ఈ చారిత్రక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడించారు. తెలంగాణ పౌరుషాన్ని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈటల రాజేందర్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగబోయే వేడుకల ఏర్పాట్లను కిషన్ రెడ్డితో కలిసి పరిశీలించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా జరుపుకోవాలని ఉద్యమ సమయంలోనే అనుకున్నామని తెలిపారు.
.webp)
ఎవరి ఒత్తిడికి లొంగారో, ఏ అప్పీజ్మెంట్ పాలసీనో తెలియదు కానీ ఇక్కడ వేడుకలు జరపబడలేదని అన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ విముక్తి జరిగిందని, కర్ణాటక, మహారాష్ట్రలో వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రం జరగడం లేదని పేర్కొన్నారు.ఇక్కడి ప్రభుత్వాలు రాజకీయాల కోసం, ఓట్ల కోసం కక్కుర్తి పడి జాతి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టాయని ఈటల రాజేందర్ విమర్శించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని అనేక ఉద్యమాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, ఈ క్రమంలో లాఠీ దెబ్బలు తిని రక్తాన్ని చిందించిందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ బహుటాను, తెలంగాణ ప్రజల స్వతంత్ర దినోత్సవాన్ని, విముక్తి దినాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందా మని, తెలంగాణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈటల రాజేందర్ కోరారు.
[ Telangana Liberation Day arrangements, TBJP, Secunderabad Parade Grounds, Union Minister G. Kishan Reddy, MP Etala Rajender, Hyderabad State, CM Revanth reddy, Vice President C.P. Radhakrishnan, Gajendra Singh Shekhawat ]


