భారీ వర్షాలపై హై అలర్ట్: ఆ జిల్లాలో రెండు రోజులు స్కూళ్లకు సెలవులు..!
Published on: Wed Sep 23, 2026 3:35PM

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రతి జిల్లాలో 24 గంటలూ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్, టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. వాగులు, చెరువులు, వరద ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెంలో రెండు రోజులు స్కూళ్లకు సెలవులు..!
భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్ తెలిపారు.జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
వర్షాల కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంఈఓలు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సంబంధిత ఆర్సీవోలను ఆదేశించారు.జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ పాఠశాలలు సెలవులకు సంబంధించిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
[ Telangana Heavy Rains, Telangana Weather, Low Pressure Area, Heavy Rainfall Alert, Red Alert Districts, Minister Ponguleti Srinivas Reddy, Telangana Rain Alert, Hyderabad Weather, School Holidays Telangana, Bhadradri Kothagudem Rains ]


