దశాబ్దాల యూఎల్‌సీ సమస్యలకు చెక్: పెండింగ్ దరఖాస్తులపై సర్కర్ కీలక నిర్ణయం.!
Published on: Sun Sep 27, 2026 4:53PM
.webp)
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ULC కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి.. అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించింది.ఈ మేరకు గతంలో జారీ చేసిన GO నం.455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్ ULC దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేలా ఆదివారం Memo.No.48062/ULC/A1/2026-1 జారీ చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హత కలిగిన కేసుల్లో నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి.. క్రమబద్ధీకరణ చర్యలను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
ULC సమస్యలకు పరిష్కారం చూపేందుకు గత ప్రభుత్వం 2016లోనే జీవో జారీ చేసినప్పటికీ.. దాని అమలు జరగకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయని మంత్రి తెలిపారు. దీంతో ప్రజలు తమ భూములపై హక్కులు, భూ లావాదేవీల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పానికి అనుగుణంగా.. సహచర మంత్రులతో చర్చించి 22Aతో ముడిపడి ఉన్న సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పొంగులేటి తెలిపారు.

ఈ నెల 16న శాసనసభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. సెక్షన్ 22Aతో ముడిపడి ఉన్న 10 నుంచి 12 కీలక అంశాలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 22A సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.అనంతరం జీఓ 118కు అనుగుణంగా మెమో, ఆ వెంటనే జీఓ 76కు అనుగుణంగా మరో మెమో జారీ చేసినట్లు చెప్పారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
ఇప్పుడు తాజాగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు. 22Aకు సంబంధించిన మిగిలిన సమస్యలకు కూడా వేగవంతమైన పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ప్రతి భూ సమస్యను పరిశీలించి.. చట్టం, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు.
[ Telangana Government, Ponguleti Srinivas Reddy, 22A Issues, ULC Applications, Urban Land Ceiling, Telangana Revenue Department, Land Regularisation, Land Disputes, CM Revanth Reddy, Telangana Land Issues ]


