TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాలపిట్ట దర్శనం, పాపాలన్నీ నాశనం.. బంధించి ప్రదర్శిస్తే మాత్రం జైలు, జరిమానా.!

Published on: Sat Oct 17, 2026 12:34PM

విజయదశమి ఉత్సవాల సందర్భంగా దసరా మండపాలు,  పూజా ప్రాంగణాల వద్ద రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను పంజరాల్లో బంధించి ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని తెలంగాణ అటవీ శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 

దసరా పండుగ రోజున పాలపిట్టను దర్శించుకోవడం శుభసూచకమని, విజయం సిద్ధస్తుందని ప్రజల విశ్వాసం.   దసరా రోజున పాలపిట్ట దర్శనం పాపాలన్నీ నాశనం అన్నది ప్రజల విశ్వాసం. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు పాలపిట్టలను పంజరంలో బంధించి  వ్యాపారంగా మలుచుకుని, అడవుల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాలపిట్టలను అక్రమంగా పట్టుకుని పంజరాల్లో బంధించి.. పండుగ రోజున ఆలయాలు, దసరా మండపాల వద్ద ప్రదర్శించి డబ్బులు వసూలు చేస్తున్నారు. 

పాలపిట్టలను అక్రమంగా బంధించి ప్రదర్శనకు పెట్టడాన్ని  అరికట్టేందుకు అటవీ శాఖ నడుంబిగించింది. ఇందులో భాగంగా దసరా మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీలకు ముందుగానే అవగాహన కల్పించేలా ప్రత్యేక పోస్టర్లను   విడుదల చేసింది. ప్రజా ప్రాంగణాల్లో ఈ పోస్టర్లను అందుబాటులో ఉంచి, బంధించిన పాలపిట్టలను చూడటం లేదా ప్రదర్శించడం మూఢనమ్మకమని, పక్షులకు హాని కలిగించడం సంప్రదాయానికి విరుద్ధమని సందేశాన్ని ఇచ్చింది.

వన్యప్రాణి సంరక్షణ చట్టం  నిబంధనల ప్రకారం పాలపిట్ట రక్షిత పక్షుల జాబితాలోకి వస్తుంది. ఈ చట్టం కింద పాలపిట్టలను వేటాడడం, బంధించడం, రవాణా చేయడం, విక్రయించడం శిక్షార్హమైన నేరం. ఉల్లంఘనకు పాల్పడిన వారికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అటవీ హెచ్చరించింది.  దేవాదాయ శాఖ,  పోలీస్ యంత్రాంగం,  ఆలయ ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణ బృందాలను రంగంలోకి దించింది.

దసరా శరన్నవరాత్రుల సమయంలో ప్రధాన ఆలయాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వేడుకల ప్రాంగణాల వద్ద అటవీ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఎవరైనా పాలపిట్టలను బంధించినట్లు సమాచారం అందితే వెంటనే అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పక్షులను బంధించి వ్యాపారం చేసే వారిపై మాత్రమే కాకుండా, వాటిని ప్రదర్శనకు అనుమతించే నిర్వాహకులపై కూడా చర్యలు ఉంటాయని అటవీశాఖ హెచ్చరించింది. 

పాలపిట్టకు ఉన్న సాంస్కృతిక, పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం దాన్ని రాష్ట్ర పక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.   పొలాల్లో పంటలకు నష్టం కలిగించే పురుగులను తినడం ద్వారా రైతులకు   మేలు చేసే ఈ పక్షి, పర్యావరణ సమతుల్యతలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా ఎగిరే పాలపిట్టను చూడడమే నిజమైన శుభమని, పంజరంలో బంధించి ఆరాధించడం భావ్యం కాదని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.

దసరా రోజున పాలపిట్టలను సహజ సిద్ధమైన వాతావరణంలో, చెట్లపై స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే తిలకించాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా పక్షుల బంధనం లేదా విక్రయం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే అటవీ శాఖ   అధికారులకు సమాచారం అందించాలని కోరింది.  

[Telangana Forest Departmen Caution, Palapitta  Dasara, Indian Roller protection, Wildlife Protection Act, Telangana State Bird, Telugu One]