తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు ట్రూ ఆప్ షాక్: నవంబర్ నుంచి అదనపు చార్జీలు.!
Published on: Tue Oct 6, 2026 9:58AM

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై చార్జీల పిడుగు పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ట్రూఅప్ ఛార్జీల రూపంలో 5,420.23 కోట్ల రూపాయలు వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) అనుమతి ఇచ్చింది. దీంతో నవంబర్ 2026 నుంచి వినియోగదారుల విద్యుత్ బిల్లులలో అదనపు చార్జీలు మోత మోగనున్నాయి.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి డిస్కంలు సమర్పించిన ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది. మిగిలిన రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి రాబట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది.
కొత్త ట్రూఅప్ వసూళ్లు నవంబర్ 2026 బిల్లుల నుంచే ప్రారంభం కానున్నాయి. నవంబర్‌లో వినియోగించే ప్రతి యూనిట్‌పై 30 పైసల అదనపు ఛార్జీ విధించనున్నారు. డిసెంబర్ నుంచి ఈ మొత్తం యూనిట్‌కు 50 పైసలకు పెరగనుంది. ఉదాహరణకు 100 యూనిట్ల విద్యుత్ వినియోగించే ఇంటికి నవంబర్‌లో సుమారు 30, డిసెంబర్ నుంచి 50 రూపాయలు అదనంగా ట్రూఅప్ ఛార్జీగా పడుతుంది.
ఈ ట్రూఆప్ వసూళ్లు టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 29 నెలలు, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 26 నెలల పాటు ఉంటాయి. అయితే వినియోగదారుడి సంబంధిత కాలంలో నమోదైన వాస్తవ విద్యుత్ వినియోగాన్ని ఆధారంగా చేసుకునేలా నియంత్రణ మండలి స్పష్టం చేసింది.

ట్రూఅప్ మొత్తంలో .4,222.93 కోట్ల రూపాయలు టీజీఎస్ పీడీసీఎల్, 1,197.30 కోట్ల రూపాయలు టీజీఎన్పీడీసీఎల్ ద్వారా రాబట్టనున్నారు. వ్యవసాయ కనెక్షన్లపై మాత్రం ఈ అదనపు భారాన్ని మోపడం లేదు. ఉచిత విద్యుత్ పథకం కింద వ్యవసాయ వినియోగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది.
వినియోగదారులకు లెక్కలు స్పష్టంగా ఉండేలా బిల్లుల్లో ట్రూఅప్ ఛార్జీలను ప్రత్యేక అంశంగా చూపించాలని టీజీఈఆర్సీ ఆదేశించింది. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు, ఎంత విద్యుత్ వినియోగాన్ని లెక్కలోకి తీసుకున్నారు, ఏ రేటు వర్తించింది, ఎంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారు వంటి వివరాలను బిల్లులో పేర్కొనాల్సి ఉంటుంది.
[Telangana Electricity Bills, Electricity Bill Hike, TGERC Trueup Charges, TGSPDCL, TGNPDCL,Telugu One]


