మళ్లీ అధికారం మాదే.. నకిరేకల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి.!
Published on: Sun Sep 6, 2026 2:47PM

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని, ఎవరి సత్తా ఏంటో అప్పుడే తేల్చుకుందామని అధికార విపక్ష నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నకిరేకల్ వేదికగా నిర్వహించిన వెయ్యి రోజుల ప్రజాపాలన ప్రగతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా, ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రైతులను మోసం చేసిన తీరును ఆయన ఎండగట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రైతుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 2 లక్షల వరకూ రుణమాఫీని పారదర్శకంగా అమలు చేశామని గుర్తుచేశారు. అలాగే రైతు భరోసా కింద కోట్లాది రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు, సన్న వడ్లకు అదనంగా బోనస్ అందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నామని వివరించారు.

మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న సీఎం.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి, ఆర్టీసికి ఇప్పటివరకు 11 వేల కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రాబోయే కాలంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ వంటి ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు.
2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించామనీ. అలాగే, యువతకు ఉపాధి కల్పనలో భాగంగా కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. అదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్నారని, ప్రజా సమస్యలపై చర్చించే దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. ఇకపై కల్వకుంట్ల కుటుంబంపై రాజకీయ దండయాత్ర ప్రారంభమవుతుందని, ఈ నెలాఖరుకు సిరిసిల్లలో, వచ్చే నెలలో సిద్దిపేటలో భారీ బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎం చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. నకిరేకల్ వేదికగా కోట్లాది ప్రజల ఆశీస్సులతో సాగుతున్న ఈ ప్రజాపాలన ప్రగతి యాత్ర రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు.
[Telangana CM Revanth Reddy Express Confidence Retain Power, Nakrekal Public Meeting, 1000 Days Praja Palana, KCR, Telangana Politics,Telugu One]


