వినాయక చవితికి ముందే రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ? ఎవరు ఇన్ ఎవరు ఔట్ అంటే?
Published on: Mon Aug 31, 2026 3:17PM

తెలంగాణ చాలా కాలంగా నలుగుతున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. గణేష్ చతుర్థికి ముందే రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అంటున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టమైన సమాచారం అందిందనీ, మంత్రివర్గంలో మార్పులూ చేర్పులూ చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను హస్తినకు వెళ్లనున్నారనీ తెలుస్తోంది.
కాగా తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉంది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే కొందరు మంత్రుల పోర్టుపోయలియోలు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే వారిలో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి పేరు ప్రముఖగా వినిపిస్తోంది. కాగా రేసులో జీహఎచ్ఎంసీ మాజీ మేయర్ విజయలక్ష్మి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇంకా రేసులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకుంటే.. టీపీసీసీ చీఫ్ గా బీసీ నాయకుడికి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. ఇంకా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. దళిత వర్గానికి చెందిన నేతకు స్పీకర్ బాధ్యతలు కట్టబెడతారంటున్నారు.
జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర పరిధిలోని కీలక నేతను కేబినెట్ లోని తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా గట్టిగా ఉందంటున్నారు. మొత్తం మీద సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత దెబ్బతినకుండా సీఎం రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటున్నారు.
[Telangana Cabinet Reshuffle , Before Vinayakachavithi, CM Revanth Reddy, Konda Surekha Issue, Vijayashanti, TPCC Chief Mahesh Kumar Goud, Assembly Speaker, Prasad Kumar]


