తెలంగాణలో షెల్టర్ జోన్ గా బీజేపీ

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నేతలకు ఒక షెల్టర్ జోన్ గా మారింది. రాష్ట్రంలో పార్టీ బలోపేరుతో వలస వచ్చే వారికి తలుపులు బార్లా తెరిచేసింది.  సిద్ధాంత నిబద్ధతలు పెట్టింది పేరుగా ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు మాత్రం ఆ నిబద్ధతకు తిలోదకాలిచ్చేసి.. తెలంగాణలో అధికారమే అసలు సిసలు సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  

ఇంత కాలం కమలం పార్టీ అంటే క్షేత్ర స్థాయి నుంచి కూడా సైద్ధాంతిక బలంతో నిర్మాణం ఉన్న పార్టీగా ఉన్న గుర్తింపు ఇప్పుడు తెలంగాణలో పూర్తిగా కనుమరుగైపోయిందనే చెప్పవచ్చు. ఇప్పడు బీజేపీలో పరిస్థితి వచ్చి చేరేవారికి తాంబూలం.. ఉన్నవారికి సున్నంలా తయారైంది. 2018 ఎన్నికలలో విజయం తరువాతా, అంతకు ముందు రాష్ట్రంలో తెరాస ఏ విధంగానైతే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల వారికి తలుపులు బార్లా  తెరిచేసిందో.. ఇప్పుడు  బిజెపి కూడా అదే పని చేస్తున్నది. ఏ పార్టీ అయినా సైద్ధాంతిక పునాది మీద బలోపేతమైతేనే  పార్టీకి ప్రజల హృదయాలలో సుస్ధిర స్థానం ఉంటుందనీ, ఏదో గెలుపు చాలు అన్నట్లు గుంపగుత్తగా నాయకులను పార్టీలోకి తెచ్చుకుంటే వచ్చి లబ్ధి తాత్కాలికమే కానీ దీర్ఘకాల ప్రయోజనాలు ఉండవని విశ్లేషకులు అంటున్నారు.

 అయితే బీజేపీ మాత్రం ఇతర పార్టీల్లోని అసంతృప్తులను, టికెట్ ఆశావహులను టార్గెట్ చేసి కాషాయ జెండా కిందకు తెచ్చుకుంటోందని అంటున్నారు. అలా చేసిన ఫలితమే ఇప్పుడు టీఆర్ఎస్ అంతర్గత విభేదాలతోనూ, దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరు ముగ్గురు నేతల మధ్య పోటీలోనూ టీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఇతర పార్టీల్లోని ఆశావాహులను, అసంతృప్తులను కాషాయం జెండా పంచన చేర్చుకుంటున్న బీజేపీ ముందు ముందు ఇప్పడు టీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.

కర్నాటక రాష్ట్రంలో ఆ పార్టీ ఎదుర్కొంటున్న అసంతృప్తి జ్వాలలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీలోని కొందరు సీనియర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచీ తెలంగాణలో పార్టీ జెండాను మోస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వలసల వల్ల గుర్తింపు లేకుండా మిగిలిపోతున్నారన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది.

 తెలంగాణలో బిజెపి పట్ల గతంలో కంటే ఒకింత సానుకూలతే వ్యక్తమౌతున్నదని పరిశీలకులు అంటున్నారు. అయితే అడ్డగొలు చేరికలతో ప్రజలు బీజేపీ ప్రత్యేకత కోల్పోతున్నదన్న అభిప్రాయం వ్యక్తం  చేస్తున్నారు.  ఈ వలసల వల్ల పార్టీని అంటి పెట్టుకుని, పార్టీకి నాయకులు లేని సమయంలో  బిజెపి జెండామోసి, ఉనికిని చాటిన నాయకులకు తగిన గుర్తింపు లేకుండా పోతుందని పలువురు సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఆలేరు నియోజకవర్గంలో బిజెపి అంటే నామమాత్రమే. మునుగోడులోనూ అదే పరిస్థితి. గత ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసిన డా. జి. మనోహర్ రెడ్డికి 12,725 ఓట్లు వచ్చాయి. ఆలేరు నియోజకవర్గంలో బిజెపి 4,967 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కాషాయరంగు పార్టీకి ప్రజల్లో ఆదరణ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఆ మనోహర్ రెడ్డి లేదా అక్కడే పార్టీ జెండాలు మోస్తున్న పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న మరో ఆశావాహులు టిక్కెట్టును ఆశించవచ్చు. కానీ కొత్త వారు చేరడం వల్ల అక్కడ పార్టీనే నమ్ముకుని, అంటిపెట్టుకుని ఇతర పార్టీల ప్రలోభాలకు లోనుకాకుండా  నిలిచిన  సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

బిజెపికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్న ప్రజల్లో కొత్త నాయకులు పార్టీలోకి చేరడం వల్ల ఆ అభిప్రాయం కాస్త వ్యతిరేకతకు దారితీసే ప్రమాదమూ  లేకపోలేదు. ప్రత్యర్థి పార్టీలు కూడా అంతే స్థాయిలో బిజెపిలోని ఆశావాహులను, సీనియర్లను తమ పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి ప్రస్తుతం బలంగా ఉన్న వాతావరణం. అందునా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మరింత దూకుడు పెంచుతోంది. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసిలోని నలుగురు కార్పోరేటర్లను గులాబీ గూటికి చేర్చుకున్నది. మహబూబ్ నగర్ లో ఓబిసి నేతను టిఆర్ఎస్ లోకి ఆహ్వానించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోనూ రావుల శ్రీధర్ రెడ్డిని టిఆర్ఎస్ లో చేర్చుకోవడంతో పాటు ఓ సంస్థకు చైర్మన్ గా నియమించింది. ఆలేరు నియోజకవర్గంలోని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కూడా కమలానికి గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉండగా.. బిజెపిలోకి మాజీలు, సీనియర్లు చేరడం వల్ల పార్టీకి ఓటింగ్ శాతం పెరుగుతుందే తప్ప గెలుపును ఖాయం చేయదనేది గత ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.

 చాలా తక్కువ ప్రాంతాల్లోనే చేరికలతో పార్టీ గెలుస్తుందే తప్ప అసమ్మతి నాయకులు, ఆశావాహులు బిజెపిలోకి చేరడం వల్ల పార్టీకి విజయాలు వాటంతట అవి వచ్చి చేరవనీ, చేరిన నాయకులకున్న పేరు, ఆ నాయకులు చేరకల అనంతరం బిజెపినే నమ్ముకుని ఉన్నవారి తీరు పార్టీ గెలుపోటములను నిర్దేశిస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఉప ఎన్నికలు జరిగిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు బిజెపి గెలిచింది. నిజమే. రెండూ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే అదీ నిజమే. కానీ హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీ బలం కంటే అక్కడ పార్టీ టికెట్ పై నిలబడిన అభ్యర్థుల సత్తాయే మిన్న అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    టిఆర్ఎస్ విజయం సాధించిన మిగిలిన రెండు ఉప ఎన్నికలలోనూ హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లలో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి.  బిజెపి గెలిచిన రెండు ఉప ఎన్నికలలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ లు  గట్టి పోటీనిచ్చాయి.  బీజేపీ చేరికలు ఆ పార్టీకి బలం అవుతాయో, వాపుగా మిగిలిపోతాయో కాలమే తేలుస్తుందని పరిశీలకులు అంటున్నారు.