పొమ్మనలేక పొగపెట్టారా: కెప్టెన్సీ నుంచి హర్మన్ ప్రీత్ కౌర్ ఔట్.. నెక్స్ట్ ఎవరు.?
Published on: Tue Oct 6, 2026 3:36PM

భారత మహిళల క్రికెట్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగింది. మంగళవారం (అక్టోబర్ 6) ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. అయితే ఆటగాడిగా భారత జట్టుకు తన సేవలను కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘకాలం భారత మహిళల జట్టుకు నాయకత్వం వహించిన హర్మన్‌ప్రీత్ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఉరుములేని పిడుగు అన్నట్లుగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ఇంత హఠాత్తుగా ఎందుకు ప్రకటించింది? అన్న ప్రశ్నలు క్రికెట్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి వైదలగుతున్నానని ప్రకటించడానికి ముందు గువహటిలో బీసీసీఐ సమావేశం జరిగింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో హర్మన్‌ప్రీత్ కౌర్ తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మందాన, హెడ్ కోచ్ అమోల్ ముజుమ్దార్ పాల్గొన్నారు.

జట్టు భవిష్యత్ ప్రణాళికలు, ఇటీవలి ప్రదర్శనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆ తరువాత హఠాత్తుగా ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో బీసీసీఐ ఆమెకు వైదొలగాల్సిందిగా అల్టిమేటమ్ ఇచ్చిందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అఫీషియల్ గా బీసీసీఐ ఆమెను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా కోరలేదు. దీంతో ఆమె స్వచ్ఛందంగానే తప్పుకున్నట్లు భావించాల్సి వస్తున్నదని క్రికెట్ పండితులు అంటున్నారు.
అది పక్కన పెడితే హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో భారత మహిళల క్రికెట్ జట్టు ఎన్నో మైలురాళ్లు అందుకుంది. 2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ తొలిసారి గెలుచుకుంది. ఆ చారిత్రక విజయంలో హర్మన్‌ప్రీత్ నాయకత్వం కీలకంగా నిలిచింది. 2026లో ఆసియా కప్, ఆసియా గేమ్స్‌లోనూ భారత జట్టు విజయాలు సాధించింది. ఆమె 2016లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి, 2022లో వన్డే, టెస్టు జట్లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారారు. ఇప్పుడు టీమ్ ఇండియా మహిళల క్రికెట్ జట్టుకు తదుపరి కెప్టెన్ ఎవరన్న ప్రశ్నకు అందరి చూపూ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా వైపే ఉంది.

గత కొన్నేళ్లుగా హర్మన్‌ప్రీత్ కౌర్‌కు డిప్యూటీగా కొనసాగుతున్న స్మృతి మంధాన, రెగ్యులర్ కెప్టెన్ అందుబాటులో లేని అనేక సందర్భాల్లో జట్టును సమర్థవంతంగా లీడ్ చేశారు. దీంతో జట్టులోని ఆటగాళ్ల మధ్య సఖ్యత, వ్యూహాత్మక అంశాలు మరియు నాయకత్వ బాధ్యతల నిర్వహణపై ఆమెకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ముఖ్యంగా మంధానకు కెప్టెన్సీ రికార్డు కూడా బ్రహ్మాండంగా ఉంది. 2024-25 మధ్య కాలంలో ఆమె నాలుగు వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించగా, ఆ నాలుగింటిలోనూ భారత్ ఘన విజయం సాధించింది.
ఇక టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోనూ హర్మన్‌ప్రీత్ గైర్హాజరీలో ఆమె 18 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించారు. వాటిలో పూర్తయిన 17 మ్యాచ్‌లలో 11 విజయాలు సాధించి, 6 మ్యాచ్‌లలో పరాజయాలను చవిచూశారు. దీంతో కెప్టెన్ గా మంధానా ట్రాక్ రికార్డ్ బాగుందనడంలో సందేహం లేదు.
[Team India women cricket Captain Smriti Mandhana, Harmanpreet Kaur, Step Down, BCCI, Women Cricket Team, Smriti Mandhana Captaincy, Telugu One]


