TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెప్టెంబర్ 5 టీచర్స్ డే జ్ఞానం నేర్పే గురువుకు మనం ఏమిస్తున్నాం..

Published on: Sat Sep 5, 2026 2:45PM

సమాజంలో అత్యంత పవిత్రమైన, బాధ్యతాయుతమైన పాత్ర గురువుది. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, జ్ఞానమనే వెలుగును నింపే మహోన్నత మూర్తి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ప్రసాదించే శక్తి గురువుకు మాత్రమే ఉంది. కేవలం పుస్తకాల్లోని పాఠాలను మాత్రమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో నేర్పించే మార్గదర్శి ఉపాధ్యాయుడు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ, మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ వేసుకోవాల్సిన ఆత్మపరిశీలన ప్రశ్న..  జ్ఞానం నేర్పే గురువుకు మనం నిజంగా ఏమిస్తున్నాం? అని. టీచర్స్ డే అంటే కేవలం గురువుకు శుభాక్షంకలు చెప్పడం, చిన్న బహుమతులు ఇవ్వడం కాదు.. టీచర్స్ డే రోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయాలు ఉన్నాయి. గురువుల నుండి జ్ఞానం పొందిన ప్రతి విద్యార్థి.. ఎంత వయసు అయిన  వారైనా సరే.. కొన్ని విషయాలు తెలుసుకోవాలి..  

మనోభావాల రూపంలో ప్రతిఫలం..

ఒకప్పుడు గురుకులాశ్రమాల్లో విద్య పూర్తయిన తర్వాత శిష్యులు తమ శక్తిమేరకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. గురువులు కూడా ఏనాడూ ధనాన్ని ఆశించకుండా సన్మార్గంలో నడిచే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా జీవించారు. మరి నేటి ఆధునిక కాలంలో మనం గురువులకు ఇస్తున్న ప్రతిఫలం ఏమిటి? కాలం మారే కొద్ది  విద్య వ్యాపారంగా మారిపోయిన నేటి సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం, వారికి లభిస్తున్న గౌరవం ఎటువైపు పయనిస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎదిగినా ఒదిగి ఉండటం లేదు..

చాలామంది విద్యాభ్యాసం పూర్తయి, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత తాము చదువుకున్న పాఠశాలలను, మార్గదర్శకత్వం వహించిన గురువులను మరిచిపోతున్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులను కేవలం జీతం తీసుకునే ఉద్యోగులుగా మాత్రమే చూసే ధోరణి పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా ఫీజులు చెల్లిస్తున్నాం కదా అనే భావనతో ఉపాధ్యాయుల శ్రమను, వారి ఆవేదనను గుర్తించలేకపోతున్నారు. తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం తపించే ఉపాధ్యాయుడికి మనం తిరిగి ఇస్తున్నది కేవలం కొన్ని పూలమాలలు, షాళ్ళు లేదా ఒక రోజు ఇచ్చే తాత్కాలిక గౌరవం మాత్రమేనా?

గురువు ఆశించే అసలైన గురుదక్షి..

ఒక గురువు తన శిష్యుడి నుంచి గిఫ్ట్ లు , ధనాన్ని ఏనాడూ ఆశించడు. ఒక ఉపాధ్యాయుడికి లభించే అతిపెద్ద బహుమతి తన విద్యార్థి ఉన్నత స్థానంలో నిలబడటమే. మనం గురువుకు ఇవ్వాల్సిన మొదటిది గౌరవం. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంతటి సంపదను ఆర్జించినా, తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయుడిని చూసినప్పుడు వినయంతో నమస్కరించడం, వారి సేవలను గుర్తుంచుకోవడం నిజమైన గౌరవం.

గుర్తింపు...

తరగతి గదిలో విద్యార్థి క్రమశిక్షణతో ఉంటూ, గురువు నేర్పిన విలువలను జీవితంలో పాటించినప్పుడు ఆ ఉపాధ్యాయుడి శ్రమకు సార్థకత లభిస్తుంది. సమాజంలో మంచి పౌరుడిగా ఎదిగి, పదిమందికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు ఫలానా ఉపాధ్యాయుడి శిష్యుడు..  అని సమాజం మెచ్చుకుంటే, ఆ మాట గురువుకు ఇచ్చే అతిపెద్ద ఆనందం.

కృతజ్ఞతా భావం..

కాలం మారినా, ఏళ్లు గడిచినా తమ జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను తరచూ గుర్తుచేసుకోవడం, వీలైతే వారిని కలసి పలకరించడం ఉపాధ్యాయులకు ఎంతో మానసిక తృప్తినిస్తుంది.

మార్పు అవసరం..

ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, గురువుల పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చుకోవాలి. ఉపాధ్యాయులను కేవలం సమాచారం అందించే యంత్రాలుగా చూడకుండా, ఒక తరాన్ని నిర్మించే శిల్పులుగా గుర్తించాలి. పాఠశాలల్లో , సమాజంలో వారికి తగిన గౌరవాన్ని, భద్రతను, అనుకూల వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

గురువు ఇచ్చిన జ్ఞానం అమూల్యమైనది. దానికి ఏ భౌతిక వస్తువూ సాటి రాదు. మనం గురువుకు తిరిగి ఇవ్వగలిగింది కేవలం హృదయపూర్వక గౌరవం, కృతజ్ఞత, వారు చూపిన సన్మార్గంలో నడవడం మాత్రమే. ఉపాధ్యాయులు నేర్పిన సద్గుణాలను, విలువలను మన జీవితంలో ఆచరిస్తూ, సమాజ శ్రేయస్సుకు తోడ్పడటమే మనం గురువులకు సమర్పించగల నిజమైన గురుదక్షిణ.

                        *రూపశ్రీ.