TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా అధ్యక్ష బాధ్యతలు: బొత్సకు చెక్.. ఇదే చంద్రబాబు వ్యూహమా?

Published on: Fri Oct 9, 2026 2:21PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పార్టీ మార్పులు, కొత్త సమీకరణాలతో వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైపీపీని జీరో చేయడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వేస్తున్న ఆడుగులు ఆసక్తికరంగా మారాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకు పెట్టని కోట లాంటి విజయనగరం జిల్లాలో ఆయన పట్టు సడలే విధంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది.  వైసీపీ  కీలక నాయకుడు, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను ఇటీవల వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరిన సంగతి తెలిసిందే.

అయితే అదేదో మామూలు చేరికగా కాకుండా.. ఏకంగా విజయనగరం జిల్లా సారథ్య బాధ్యతలను ఆయనకు అప్పగించి వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 

అయితే విజయనగరం జడ్పీ చైర్మన్ గా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన, జిల్లాలో మంచి రాజకీయ పలుకుబడి ఉన్న చిన్న శ్రీనును తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఆషామాషీది కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చిన్న శ్రీను గత నెలలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఆయన తో పాటు పలువురు ఆయన అనుచరులు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా చిన్న శ్రీను ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం గూటికి వచ్చినట్లు విస్పష్టంగా చెప్పారు. తన చేరికకు ఎటువంటి షరతులు, పదవుల ప్రలోభాలూ లేవని కుండబద్దలు కొట్టారు.  

తెలుగుదేశం గూటికి చేరిన తరువాత చిన్న శ్రీను వరుసగా ఆ పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.   చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ను ఆయన కలిసి జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే చిన్న శ్రీనుకు తెలుగుదేశం జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇందుకు  చిన్న శ్రీనుకు జిల్లాపై ఉన్న పట్టు, పలుకుపడే ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. 


చిన్న శ్రీనుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారానికి ప్రధాన కారణం జిల్లాలో ఆయనకు ఉన్న రాజకీయ పరిచయాలే అనడంలో సందేహం లేదు. అదే గనుక జరిగితే విజయనగరంలో బొత్స హవాకు పూర్తిగా గండి పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

[TDP Vijayanagaram President Chinna Srinu, Chandrababu Naidu, Chinna Srinu, Majji Srinivasa Rao, Vizianagaram TDP, TDP District President, Nara Lokesh, YCP to TDP,Telugu One]