జగన్ కేసులపై ప్రతి రోజూ విచారణ సరిపోదు: రోజంతా జరపాలి: ఈడీ పిటిషన్‌కు సోమిరెడ్డి మద్దతు.!
Published on: Mon Oct 12, 2026 11:36AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులు మరోసారి చర్చనీయంశంగా మారాయి. ఈ కేసులను రోజు వారీ విచారణ చేపట్టాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేయడాన్ని తెలుగుదేశం స్వాగతించింది. జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఆదివారం (అక్టోబర్ 11) మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి జగన్‌పై నమోదైన కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నలు సంధించారు. 2011లో సీబీఐ కేసులు నమోదు చేసినప్పటికీ, ఇంతకాలం గడిచినా విచారణ ప్రక్రియ ముందుకు సాగకపోవడం ఆందోళనకరమన్నారు. ఈ కేసుల్లో న్యాయప్రక్రియ వేగంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్న ఆయన.. జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసు దేశంలోనే అతిపెద్ద అవినీతి కేసుగా అభివర్ణించారు.
తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రూ.43 వేల కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టారని ఆరోపించిన ఆయన.. డిశ్చార్జి పిటిషన్ల పేరుతో విచారణను ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సంబంధించిన కేసుల విచారణతో పోల్చుతూ, జగన్ కేసుల్లోనూ న్యాయప్రక్రియ త్వరగా పూర్తికావాలన్నారు.
.webp)
అదలా ఉంటే.. జగన్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ ఈడీ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం తీసుకునే నిర్ణయం, విచారణను వేగవంతం చేసేందుకు ఎలాంటి ఆదేశాలు వెలువడతాయన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, ఈ కేసులు రాజకీయ విమర్శలకు కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఆరోపణలు, ప్రతివాదనలు పక్కనపెడితే, కేసులపై న్యాయస్థానాల్లో సకాలంలో విచారణ జరగడం, ఆధారాల ఆధారంగా నిర్ణయాలు వెలువడటం ప్రజలకు కీలకం. ఇప్పటికైనా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రోజు వారీ జరిగి, ఇకెంత మాత్రం జాప్యం లేకుండా తుది తీర్పు వెల్లడి కావాలని పలువురు కోరుతున్నారు.
[TDP MLA Somireddy On Jagan Cases, Somireddy Chandramohan Reddy, Jagans Disproportionate Assets Case, ED Petition, AP Politics, Telugu One]


