పల్లెపల్లెకు పసుపు దండు.. డిసెంబర్ లో  గౌరవ సభలు

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి కార్యచరణ ప్రకటించింది ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ. డిసెంబర్ 1 నుంచి పల్లెపల్లెకు వెళ్లనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు డిమాండ్స్ తో కూడిన ఎజెండాను సిద్ధం చేసింది.  ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అసభ్య పదజాలంపై జనంలోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.  మొత్తం 17 అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది టీడీపీ.

అధికార వైసీపీని గద్దెదించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వరకు విశ్రమించకుండా పోరాటం సాగించాలని పొలిటిబ్యూరో సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. చట్టాలు చేయాల్సిన గౌరవ సభ .. జగన్ రెడ్డి అధ్యక్షతన కౌర సభగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా మహిళల వ్యక్తిత్వంపై ఏవిధంగా దాడి చేశారో ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగం డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని నిర్ణయించింది పొలిట్ బ్యూరో సమావేశం. సామాజంలో ఆడపడుచుల గౌరవంపై విస్తృత స్థాయిలో చైతన్యం కల్పించాలని పార్టీ భావిస్తోంది.

ఏపీ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పై అధికార పార్టీ నేతలు చేసిన వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వం హననం పై చంద్రబాబు భావోద్వేగానికి లోనై,తిరిగి ముఖ్యమంత్రి అయిన తరువాతే మళ్లీ అసెంబ్లీ అడుగుపెడుతానని శపథం చేశారు. చంద్రబాబు శపథంపై పొలిట్ బ్యూరో సభ్యులు ఏకగ్రీవంగా మద్దతును ప్రకటించారు. పార్టీ నాయకుల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు చంద్రబాబు అసెంబ్లీ శపథంపై కట్టుబడి ఉందని సభ్యులు పేర్కొన్నారు. దీనిబట్టిచూస్తే.. అందుకు తగిన విధంగా గ్రాస్ రూట్ లో పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రాయలసీమలో సంభవించిన వరదలు, మరణాలపై న్యాయ విచారణ డిమాండ్ తోపాటు వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు 25 నష్టపరిహారం చెల్లించాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ సీరియస్ వ్యాఖ్యలు, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం వంటి వాటిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాని, బీసీలకు రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని, పంచాయితీ నిధులను వెంటనే జమచేయాలని ఇలా పలు అంశాలతో కూడిన డిమాండ్స్ ను ఎజెండాగా సభ్యులు రూపొందించారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చైనా సరే.. ప్రజలకు మేలు జరిగేలా చూడాలని అధినేత చంద్రబాబు సభ్యులకు దిశానిర్దేశం చేశారు.